అయ్యన్న దెబ్బకు గంటా ఏంచేస్తున్నారంటే?

మంత్రి అయ్యన్న దెబ్బకు గంటా శ్రీనివాసరావు ఇబ్బంది పడుతున్నారా? ప్రతి విషయంలో… ప్రతి నిర్ణయంలో తనకు వ్యతిరేకంగా గళం విప్పే అయ్యన్న నుంచి బయటపడతేనే మేలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు గంటా సన్నిహితులు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు, మరో మంత్రి అయ్యన్న పాత్రుడుకు అస్సలు పొసగదు. మంత్రి అయ్యన్న అయితే బహిరంగంగానే గంటాపై విరుచుకుపడతారు. ఎప్పుడు ఏ కామెంట్ చేస్తారో తెలియదు. అధిష్టానం కూడా అయ్యన్న నోటికి తాళం వేసే ప్రయత్నం చేయడం లేదు. దీంతో గంటా శ్రీనివాసరావు ఈసారి జిల్లానే వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

విశాఖకు గుడ్ బై చెబుతారా?

మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ప్రతిదీ సమస్యే. తనకు వ్యతిరేకంగా గ్రూపులు బయలుదేరాయి. చివరకు తనకు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా దూరంగా వెళ్లిపోయారు. దీంతో గంటా మనస్థాపం చెందారని తెలిసింది. విశాఖ రాజకీయాలకు గంటా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. గంటా వాస్తవానికి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే విశాఖ వచ్చి సెటిల్ అయిపోయారు. ఇదే విషయాన్ని అయ్యన్న పదే పదే గుర్తు చేస్తుంటారు కూడా.

ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారుస్తూ…..

దీంతో గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లాకు షిఫ్ట్ అయిపోవాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి గంటా ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మారుస్తూ వస్తుంటారు. తొలుత అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు, తర్వాత చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా , తర్వాత భీమిలీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గంటా నియోజకవర్గాలనే కాదు పార్టీలను కూడా మార్చేస్తుంటారు. ఆయన టీడీపీ నుంచిప్రజారాజ్యంలోకి, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి తిరిగి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా మారారు.

నెలిమర్ల నుంచి పోటీ…?

అయితే ఈసారి మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నెలిమర్ల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామికి వృద్ధాప్యం రావడం, అవినీతి ఆరోపణలు కూడా రావడంతో గంటా నెలిమర్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం గంటా విజయనగరం జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఉండటంతో తన పనిని సులువుగా చక్కబెట్టుకుంటున్నారు. తనకంటూ ఒక వర్గాన్ని విజయనగరంలో ఏర్పాటు చేసుకున్న గంటా వచ్చే ఎన్నికల్లో నెలిమర్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. మరి పార్టీ ఏదో చెప్పలేం కాని, నియోజకవర్గం మారడం ఖాయమని ఎద్దేవా చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు.

Ravi Batchali
About Ravi Batchali 22529 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*