గంటా బ్యాచ్ జంప్ కు రెడీ అవుతుందా…!!

ganta-srinivasarao-telugudesamparty

రాజకీయాల్లో ఆనవాయితీ పాటించడం అసలు కుదరదు. కానీ విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సెపరేట్. ఆయన పద్ధతులకు చాలా విలువ ఇస్తారు. ప్రతీ ఎన్నికకూ ఓ పార్టీ ఉండాలి, ఓ కొత్త నియోజకవర్గం ఉండాలి. ఇదీ గంటా స్టాంగ్ సెంటిమెంట్. ఈసారికి సీటు మారినా పార్టీ మారకపోవడం వల్ల రాజయోగం దక్కలేదు. దాంతో తెగ బాధపడిపోతున్న గంటా ఇపుడైనా పోయిందేముంది పార్టీ మారిపోతే సరి అనుకుంటున్నారుట. వైసీపీలోకి వెళ్దామంటే అక్కడ జగన్ నో ఎంట్రీ బోర్డ్ చూపించేశారు. దాంతో ఆయన చూపు ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద పడిందని టాక్. అన్నీ అనుకూలిస్తే ఆయన తన బ్యాచ్ తో సహా కమలం గూటికి చేరుకుంటారని అంటున్నారు.

పార్టీ మీటింగులకు డుమ్మా….

తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. విశాఖ అర్బన్ జిల్లాలో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా నాలుగంటే నాలుగు సీట్లను గెలుచుకుంది. దాంతో ఇప్పట్లో పార్టీని లేపడం కష్టమన్న భావనకు తలపండిన సీనియర్లు వచ్చేశారు. ఇక గంటా విషయానికి వస్తే అధికార వియోగాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఆయన పార్టీకి టచ్ మీ నాట్ అంటున్నారు. ఈ మధ్య జరిగిన పార్టీ సమీక్షా సమావెశానికి గంటా గైర్హాజరు కావడం పెద్ద చర్చగా ఉంది. ఆయన రాజకీయ ప్రత్యర్ధి, సీనియర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రావడం వల్లనే గంటా రాలేదని మొదట్లో ప్రచారం జరిగినా ఇపుడు అది కాదని తేలిపోయింది. గంటా టీడీపీలో ఉండలేకపోతున్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని అంటున్నారు. అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండడం భారంగా భావిస్తున్న గంటా బీజేపీకి టచ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది.

వెంట మరింతమంది…

గంటాకు ఓ అలవాటు ఉంది. ఏ పార్టీలోకి జంప్ చేసినా ఒక్కరుగా వెళ్ళరు. ఆయన వెనకాల మరికొందరిని కూడా తీసుకువెళ్తారు. ప్రజారాజ్యం నుంచి, కాంగ్రెస్, అటునుంచి టీడీపీలోకి మారినపుడు కనీసంగా అరడజన్ మంది ఎమ్మెల్యేలను గంటా వెంట తీసుకెళ్ళారు. ఇపుడు గంటా వెంట ఎంత మంది నడుస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. విశాఖలో చూసుకుంటే గెలిచిన నలుగురులో ముగ్గురు గంటాకు సన్నిహితులే, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఒక్కరే అయ్యన్నపాత్రుడు వర్గం ఎమ్మెల్యే. ఆ విధంగా ఈ ముగ్గురితో పాటు, మిగిలిన జిల్లాల్లోనూ గంటాకు ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నాయి. మరి ఎంతమందిని ఆయన తీసుకెళ్తారన్నది టీడీపీ పెద్దల‌నూ కలవరపెడుతోంది. గంటా మౌనంగా ఉండడం, ఎవరికీ అందుబాటులోకి రాకపోవడంతో ఆయన రాజకీయ వ్యూహం పసుపు పార్టీని తెగ కలవరపెడుతోంది. ఏది ఏమైనా గంటా కనుక ఫిరాయిస్తే ఆ దెబ్బ అలా ఇలా ఉండడని, మొత్తం 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో కనీసం మూడవ వంతు ఎమ్మెల్యేలను ఆయన తనతో పాటుగానే తీసుకెళ్ళిపోతారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.

Ravi Batchali
About Ravi Batchali 20479 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*