మళ్ళీ మొదలయిందిగా…!!

ganta-srinivasarao-vs-ayyannapathrudu

విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాల్లో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులది చెరో దారిగా ఉందన్నది తెలిసిందే. ఇద్దరిదీ దశాబ్దాల వైరం. సొంత పార్టీలో ప్రత్యర్ధులుగా కత్తులు దూసుకుంటున్న వీరిని ముందు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో జిల్లాలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. అయతే ఒకరిని ఒకరు ఓడించుకోవాలనుకునేంతగా మంత్రుల రాజకీయం ముదిరిపోయింది. తాజాగా మంత్రి గంటాపై అయ్యన్న చేసిన పరోక్ష వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నే రేపుతున్నాయి. స్థానికేతరులు అంటూ అయ్యన్న చేసిన హాట్ కామెంట్స్ నేరుగా గంటానే తాకుతున్నాయి. ఎక్కడ నుంచో వచ్చి విశాఖ జిల్లాలో రాజకీయం చేస్తున్నారు. అందరికీ ఈ జిల్లా బాగా చులకన అయిపోయిందంటూ అయ్యన్న అందుకున్న తిట్ల పురాణం వెనక లక్ష్యం మంత్రి గంటా అన్నది అందరికీ తెలిసిందే.

సూటు కేసులతో వస్తారట….

విశాఖ జిల్లాకు సూటు కేసులు పట్టుకుని వస్తున్న నాయకులను నమ్మొద్దంటూ అయ్యన్న బాహాటంగా పిలుపు ఇవ్వడం ఇపుడు చర్చనీయాంశమైంది. ఎక్కడ నుంచో ఇక్కడకు వచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారంటూ నేరుగా గంటా గ్యాంగ్ మీదనే అయ్యన్న విసుర్లు విసిరారు. ఎన్నికలకు కేవలం పద్నాలుగు రోజుల ముందర వచ్చిన వారు ఇక్కడ గెలిచిపోతున్నారని, నోట్ల కట్టలు వెదజల్లి నాయకులు అయిపోతున్నారని అయ్యన్న అనడం ద్వారా మంత్రిని టార్గెట్ చేశారు. అటువంటి వారి వల్ల జిల్లాకు ఒరిగేది ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు తగ్గడానికి ఈ తరహా రాజకీయ నేతలు కారణమని కూడా అయ్యన్న అనడం విశేషం. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీని వదిలి వైసీపీలో చేరడాన్ని తప్పు పట్టిన అయ్యన్న పనిలో పనిగా వలస నేతలందరి మీదా బాణాలు వేశారు.

అధికార పార్టీలో వారే ఎక్కువ…..

ఇదిలా ఉండంగా అధికార పార్టీలో అధికులు వలస నేతలే కావడం గమనార్హం. పైగా వారంతా గంటా తీసుకువ‌చ్చిన బ్యాచ్ కావడం మరో విశేషం. గంటా ప్రకాశం జిల్లాకు చెందిన వారు. ఆయన రెండు దశాబ్దాల క్రితం అనకాపల్లి నుంచి ఎంపీగా నిలబడి గెలిచారు. ఆ తరువాత విశాఖను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళినపుడు మరికొంతమంది వలస నాయకులను వెంట తెచ్చారు. వారిలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు వంటి వారున్నారు. అలాగే ఆయన దగ్గర బంధువు పరుచూరి భాస్కర రావు కూడా ఇపుడు టీడీపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ నేతగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే వరసలో మరికొందరు నాయకులు కూడా ఉన్నారు. వీరందరినీ దృష్టిలో ఉంచుకుని మొత్తంగా వలస నాయకులపైన మంత్రి అయ్యన్న ఘాటు విమర్శలు చేయడం ఇపుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల వేళ అయ్యన్న చేసిన ఈ విమర్శలకు గంటా ఏ రకమైన బదులు ఇస్తారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 37161 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*