
అదేదో సినిమాలో పాటలా జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక వైపు, మెజారిటీ ఎమ్మెల్యేలు మరో వైపు ఉన్న దృశ్యం ఇపుడు విశాఖ టీడీపీలో కనిపిస్తోంది. అసలే ఎన్నికల వేళ పార్టీలో ఇలా వైరి వర్గాలు మోహరించి ఉన్న సన్నివేశం జయాపజయాలపై పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. విశాఖ పర్యటనకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చినా మంత్రి గంటా మీద కోపంతో ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం చర్చకు దారితీస్తోంది. అధినేత దృష్టికి దీన్ని తీసుకురావాలన్న వ్యూహంలో భాగంగానే ఎమ్మెల్యేలు ఈ విధంగా చేశారని అంటున్నారు. విశాఖ ఉత్సవ్ సహా ఎన్నో కార్యక్రమాలు నగరంలో గంటా తన చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. ఇందులో సాటి ఎమ్మెల్యేలను కలుపుకునిపోవడం కానీ, వారిని భాగస్వాములు చేయడం కానీ గంటా చేయకపోవడం పట్ల ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు.
ఆ వైరం అలాగే……
ఇక జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు గంటాతో తన వైరాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. గంటా ఆద్వర్యంలో జరిగే ఏ కార్యక్రమం అయినా ఆయన గైర్హాజరు కావడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నా గణబాబు, పీలా గోవింద సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే రాజు, పల్లా శ్రీనివాసరావు వంటి వారు గంటాకు దూరంగా ఉంటున్నారు. వారంతా మంత్రి ఒంటెత్తు పోకడలను సహించలేకపోతున్నారని అంటున్నారు. మంత్రి తాను అనుకున్న వారికే పనులు చేసిపెడుతూ తన కోటరీకే పెద్ద పీట వేస్తున్నరని ఎమ్మెల్యేలు చాలాకాలంగా గుస్సా అవుతున్నారు. దీని మీద ఇంచార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో చెప్పినా కూడా ఆయన సైతం ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఏకంగా చంద్రబాబుతో సాన్నిహిత్యం నెరపుతున్న మంత్రి గంటా ఎవరినీ పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి.
పార్టీ పరిస్థితేంటి…?
ఎన్నీకల్లో అన్ని సీట్లు గెలవాలని ఓ వైపు చంద్రబాబు గొంతు చించుకుంటూంటే విశాఖ జిల్లాలో మాత్రం పార్టీ వర్గ పోరుతో సతమవుతూ ఉండడం పట్ల పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇద్దరు మంత్రులకు పడదు, సీనియర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు పడదు, ఒక మంత్రి వస్తే రెండో వారు రారు, మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీలో తలో విధంగా ఉంటున్నారు. మరి దీన్ని చక్కదిద్దాల్సిన ఇంచార్జి మంత్రి పార్టీ మీటింగులు పెట్టడమే ఘనం అన్నట్లుగా ఉంటోంది. వీటిని ఏ విధంగా మరమ్మతు చేయాలన్నది పెద్ద సవాల్ గానే ఉందని అంటున్నారు. జిల్లాలో పార్టీకి అసలే ప్రజా వ్యతిరేకత ఉంది. దానికి తోడు కుమ్ములాటలు కూడా జత కలిస్తే రేపటి ఎన్నికల్లో గెలిచినట్లేనని కార్యకర్తలే అంటున్నారంటే సైకిల్ పార్టీ స్థితికి అది అద్దం పడుతోంది. మరి ఎమ్మెల్యేల అసంతృప్తి, మంత్రుల మధ్యన విభేదాలను అధినేత చంద్రబాబు అయినా చక్కదిద్దుతారో లేదో చూడాలి.
Leave a Reply