
ఇలా ఎన్నికలు జరిగాయో లేదో అలా మంత్రులు ఇద్దరూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. విశాఖ జిల్లాలో టీడీపీకి గత అయిదేళ్ళుగా ఉన్న సమస్య ఇదే. సీనియర్ మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వ్యవహరించారు. దాంతోనే పార్టీ బాగా దెబ్బతింది. ఇక ఎన్నికల్లోనూ మంత్రులు తమ అసెంబ్లీ సీటు దాటి బయటకు రాలేదు. ఇద్దరికీ టైట్ ఫైట్ కావడమే అసలు విషయం. ఎన్నికలు అయిపోయాయి. విశాఖ నార్త్ లో మంత్రి గంటాకు గెలుపు కష్టమేనని అంటున్నారు. అలాగే నర్శీపట్నంలో అయ్యన్న విజయం సాధిస్తారని నమ్మకం లేదన్న మాట వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మంత్రులు తమ విజయం గురించి మాట్లాడడం లేదు. ఇపుడు అనూహ్యంగా మంత్రి అయ్యన్న గంటాపై ఇండైరెక్ట్ గా మాటల దాడి మొదలెట్టేశారు.
రేవ్ పార్టీ బాధ్యుల పైన చర్యలట….
విశాఖలో ఈ మధ్య జరిగిన రేవ్ పార్టీ పెద్ద అంశమైపోయింది. పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకే బీచ్ వద్ద జరిగిన రేవ్ పార్టీ సంచలనం రేపింది. ఈ పార్టీలో మందు, విందు మాదకద్రవ్యాలు ప్రధాన పాత్ర పోషించాయి. బాగా డబ్బున్న వారి వారసులు హల్ చల్ చేశారు. రాత్రంతా ఆడి పాడారు. దీని మీద మీడియాలో రావడంతో పోలీసులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని వదిలేశారు అయితే ఈ పార్టీలో మంత్రి గంటా అనుచరుల పాత్ర ఎక్కువగా ఉందని వార్తలు గట్టిగా ఉన్నాయి. రాజకీయ బలం, పలుకుబడి కారణం వల్లనే పోలీసులు కేసులు పెట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఇపుడు అయ్యన పట్టుకున్నారు. ఎందుకు కేసులు పెట్టరంటూ పోలీసులను ఆయన కడిగిపారేస్తున్నారు.
గంటా పైన అటాక్….
పైకి రేవ్ పార్టీ మీద అయ్యన్న మాట్లాడుతున్నా అసలు కధ గంటాను ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశ్యమే ఉందని అంటున్నారు. అందువల్లనే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న మంత్రి గారు ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారని భోగట్టా. ఓ వైపు ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. వచ్చేది టీడీపీ సర్కార్ అయితే మరో మారు గంటా మంత్రి కాకుండా అడ్డుకోవడానికి ముందస్తుగా అయ్యన్న ఈ రేవ్ పార్టీల అంశాన్ని ఆసరాగా చేసుకుని బదనాం చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు ఈసారి అయ్యన్న ఓడిపోతారని, మొత్తం మీద జిల్లాలో చక్రం తిప్పాలని గంటా భావిస్తున్నట్లుగా టీడీపీ శిబిరంలో మరో మాట వినిపిస్తోంది. ఇద్దరు మంత్రులు ఓడిపోతేనే పార్టీకి మంచి రోజులు వస్తాయని పార్టీలోని తటస్థులు అంటున్నారు. మొత్తం మీద టీడీపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పార్టీ పరువు గంగలో కలిపేయడానికి పెద్ద తలకాయలు మళ్ళీ చేయాల్సినదంతా చేస్తున్నాయని తమ్ముళ్ళు మండిపడుతున్నారు. చూడాలి ఈ మాటల యుద్ధం ఎన్ని మలుపులు తీసుకుంటుందో.
Leave a Reply