బుచ్చన్నకు బుచికి..బుచికేనా…??

gorantla-buchaiah-choudary-rajahmundry-rural-constiuency

తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు కోసం అవస్థలు పడుతున్నారు.అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఈసారి గోరంట్ల బుచ్యయ్య చౌదరి విజయం సాధిస్తే ఆరోసారి ఎమ్మెల్యే అయినట్లు. కానీ అది జరుగుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. విచిత్రమేమిటంటే ఇక్కడ జనసేన అభ్యర్థి నెంబర్ వన్ స్థానంలో ఉండటమే. జనసేన అభ్యర్థి ఇక్కడ గెలిచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ బలంగా ఉండటంతో బుచ్చయ్య మరోసారి ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కటం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా.

గోరంట్ల అభివృద్ధి చేసినా….

రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచే ఎప్పుడూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేసేవారు. గత ఎన్నికలలో పొత్తులో భాగంగా అర్బన్ సీటు బీజేపీకి వెళ్లడంతో బుచ్చయ్యను టీడీపీ అధిష్టానం రూరల్ నియోజకవర్గానికి పంపింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, జనసేన మద్దతు ఉండటంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు పై దాదాపు 18 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గోరంట్ల అభివృద్ధి పనులు బాగానే చేశారన్న టాక్ ఉంది. ఇదే సమయంలో ఆయనపై వేమగిరి ఇసుక ర్యాంప్, క్వారీ అక్రమాల ఆరోపణలు కూడా బలంగానే విన్పిస్తున్నాయి.

దూసుకుపోతున్న జనసేన….

ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ తొలుత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. టిక్కెట్ పై జగన్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కందుల దుర్గేష్ జనసేన లో చేరారు. కందుల దుర్గేష్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తన నిధులన్నీ రూరల్ నియోజకవర్గంలోనే ఖర్చు చేశారు. గత ఐదేళ్లుగా రూరల్ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. ఇక్కడ కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండటం, పవన్ అభిమానుల దండు దండిగా ఉండటంతో ఈయనకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

అందుకే ఇక్కడ గెలుపు…..

2009లో కొత్తగా ఏర్పడిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన స్వామినాయుడు ఇక్కడ ద్వితీయ స్థానంలో నిలవడం విశేషం. అప్పటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చందన రమేష్ పై స్వామినాయుడు కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రస్తుతం జనసేన అభ్యర్థికి విజయావకాశాలున్నాయంటున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఆకుల వీర్రాజు మరోసారి బరిలో ఉన్నారు. ఈయన ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ వయసు సహకరించడం లేదంటున్నారు. మొత్తం మీద బయటనుంచి చూస్తే ఇక్కడ త్రిముఖ పోటీలా కన్పిస్తున్నా ఛాన్స్ మాత్రం జనసేనకే ఉందంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 16593 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*