బుచ్చన్నకు లైన్ క్లియర్ కాలేదటగా…!!!

gorantla-buchaiah-choudary-telugudesamparty

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పరిచయం అక్కరలేని పేరు. అయితే ఈయనకు ఈసారి టిక్కెట్ ఎక్కడ దక్కుతుందనేదే సస్పెన్స్ గా మారింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేనే. అయితే ఆయన ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి గోరంట్లకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోనేపట్టు ఎక్కువ. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా రాజమండ్రి అర్బన్ టిక్కెట్ బీజేపీకి కేటాయించారు. ఇక్కడ నుంచి బీజేపీ తరుపున ఆకుల సత్యనారాయణ పోటీ చేసి విజయం సాధించారు. బుచ్చయ్య చౌదరి రూరల్ నియోజకవర్గానికి వెళ్లి విజయం సాధించారు.

అర్బన్ పైనే మక్కువ….

కానీ ఈసారి బీజేపీతో పొత్తు లేకపోవడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన పాత స్థానం అర్బన్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన ఐదేళ్లుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటీకి మనసంతా అర్బన్ మీదే ఉంది. ప్రస్తుత రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఇక్కడ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముంది. ఇక వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారయినట్లే చెప్పాలి. ఇలా ప్రధాన పార్టీలైన వైసీపీ, జనసేన అభ్యర్థులు ఖరారయినా అధికార టీడీపీ నుంచి బుచ్చన్నకు ఇంకా గ్రన్ సిగ్నల్ లభించలేదట.

ఆదిరెడ్డి అప్పారావు సయితం….

తాను గతంలో పోటీ చేసిన అర్బన్ నియోజకవర్గం సీటు కావాలని బుచ్చయ్య చౌదరి గట్టిగా కోరుతున్నారు. అయితే బుచ్చన్నకు పోటీగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అర్బన్ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిరెడ్డి భార్య వీరరాఘవమ్మ రాజమండ్రి మేయర్ గా గతంలో ఉన్నారు. ఆదిరెడ్డి అప్పారావు తన తనయుడు ఆదిరెడ్డి వాసుకు రాజమండ్రి అర్బన్ టిక్కెట్ ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. అర్బన్ వ్యవహారాలను ఇప్పటికే ఆదిరెడ్డి అప్పారావు చూస్తుండటంతో తమ కుటుంబానికే టిక్కెట్ అని ఆయన ధీమాగా ఉన్నారు.

ముగ్గురు పోటీ పడుతుండటంతో….

ఆదిరెడ్డి అప్పారావు స్వయానా దివంగత ఎర్రన్నాయుడు వియ్యంకుడు. అంటే ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఎర్రన్నాయుడి కుమార్తె. దీంతో ఆదిరెడ్డి అప్పారావు అటు నుంచి తన సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిరెడ్డి అప్పారావు మహిళ కోటాలో తన కోడలకైనా అర్బన్ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.నారా లోకేష్ నుంచి ఈ మేరకు వారికి హామీ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరో కీలక నేత గన్ని కృష్ణ కూడా అర్బన్ సీటుపై కన్నేశారు. మొత్తం మీద అర్బన్ సీటు వ్యవహారంలో బుచ్చన్నకు ఇంకా లైన్ క్లియర్ కాలేదన్నమాటే. మరి అర్బన్ టిక్కెట్ విషయంలో సీనియర్ నేత బుచ్చన్న కు బాబు హ్యాండిస్తారా? టిక్కెట్ ఇస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 29997 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*