
మూలిగే నక్కపై తాటికాయ పడిందన్నది సామెత. ఈ సామెత ఏపీ మంత్రి గుమ్మనూరి జయరాంకు సరిగ్గా సరిపోతుంది. రెండున్నరేళ్ల తర్వాత జగన్ మంత్రి వర్గం నుంచి తొలిగించే మంత్రుల్లో గుమ్మనూరి జయరాం ఒకరు. ఆయనపై ఒకటా? రెండా? అనేక ఆరోపణలు. మంత్రిసొంత గ్రామంలో పేకాట క్లబ్బు లపై పోలీసుల దాడి అప్పట్లో సంచలనం రేపింది. మంత్రి సోదరుడే ఈ పేకాట క్లబ్లులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈఎస్ఐ స్కాంలో……
ఇక ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడితో మంత్రి గుమ్మనూరి జయరాం కుమారుడు చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఖరీదైన కారును గిఫ్ట్ గా తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడయితే ఏకంగా ఆధారలివిగో అంటూ ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే తాను బీసీ మంత్రిని అయినందునే తనపై టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తుందని, తాను అమాయకుడినని గుమ్మనూరి జయరాం చెప్పుకున్నారు.
పంచాయతీ ఎన్నికలలో….
ఈ ఆరోపణలపై గుమ్మనూరి జయరాం ఒక దశలో ముఖ్యమంత్రి జగన్ కు వివరణ ఇచ్చుకున్నారు కూడా. నిజానికి మంత్రిపై వచ్చిన ఆరో్పణలకు జగన్ ఎప్పడో ఆయనను తప్పించాల్సిందని, అయితే విపక్షాలు చేసిన ఆరోపణలకు బలం మరింత ఇచ్చినట్లవుతుందని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పుడు గుమ్మనూరి జయరాం పరిస్థిితి మరింత ఇబ్బందికరంగా మారింది. పంచాయతీ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేలా చేశాయి.
మంత్రిగారిపై అసంతృప్తి అంటూ…
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో అధిక స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆలూరు మేజర్ పంచాయతీలోనూ టీడీపీ మద్దతుదారు అరుణదేవి గెలుపొందారు. ఆలూరు నియోజకవర్గంలో మొత్తం 27 పంచాయతీల వరకూ టీడీపీ గెలుచుకుంది. ఇక్కడ టీడీపీ ఇన్ ఛార్జి కోట్ల సుజాతమ్మ పంచాయతీ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షించారు. గుమ్మనూరి జయరాంపై ఉన్న వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద అసలే అనేకరకమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న గుమ్మనూరి జయరాంకు పంచాయతీ ఎన్నికలు మరింత షాక్ కు గురి చేశాయి.
Leave a Reply