
గత నాలుగేళ్ళుగా ఏ పార్టీలోకి వెళతారా అని మాజీ ఎంపి హర్ష కుమార్ రాజకీయ ప్రయాణం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జనసేన లో చేరేందుకు ఆసక్తి గా ఉన్నట్లు ఇటీవల హర్ష కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిచేసి సస్పెన్స్ కి తెరదించారు. ప్రస్తుతం ఏపీలో వున్న రాజకీయ పార్టీల్లో జనసేన అయితేనే ప్రజలకు న్యాయం చేసేదిగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయలు సంపాదించే వృత్తిని వదులుకుని పవన్ రాజకీయాల్లోకి రావడాన్ని హర్షిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఆ పార్టీలోకి ఎప్పుడు చేరేది ఆయన స్పష్టం చేయలేదు. పవన్ కళ్యాణ్ తో తాను చేరే అంశం చర్చించలేదని మాత్రం స్పష్టం చేశారు హర్ష కుమార్.
అమలాపురం లో తిరుగులేదా…?
జనసేన నుంచి హర్ష కుమార్ ఎంపీగా పోటీ చేస్తే అమలాపురంలో తిరుగు ఉండదన్నది ఆయన వర్గీయుల అంచనా. కాపు, ఎస్సి సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తగా జనసేనకు పడితే అక్కడ విజయం ఖాయమన్న లెక్క వారిది. ఈ మైనస్, ప్లస్ లన్ని లెక్కసుకున్నాకే హర్ష ఫైనల్ గా ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క టిడిపి బాలయోగి కుమారుడిని బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉందనే ప్రచారం నేపథ్యంలో జనసేన నుంచి హర్ష దిగితే వార్ వన్ సైడ్ అవుతుందనే అంచనా జనసేన వర్గాల్లో కూడా వుంది. మరోపక్క వైసిపి నుంచి పినిపే విశ్వరూప్ కూడా పార్లమెంటరీ నియోజక వర్గంలో బాగా యాక్టివ్ గా వున్నారు. ముక్కోణపు పోటీలో రెండు బలమైన సామాజిక వర్గాలు ఎటు ఉంటే అటే అమలాపురం ఎంపి స్థానం దక్కుతుందనే లెక్కలు వున్నాయి.
కాంగ్రెస్ కి వెళ్ళబోయి…
హర్ష కుమార్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీకి అంతా రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ ఈలోగా చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టడం, ఏపీలో కూడా సైకిల్ కాంగ్రెస్ లు కలిసి నడవబోతున్న తరుణంలో తన ప్రయత్నాన్ని చివరిలో విరమించుకున్నారు హర్ష కుమార్. దాంతో వున్న పార్టీల్లో జనసేన తన రాజకీయ భవితకు మెరుగన్న అంచనా తో ఆ పార్టీ వైపే మొగ్గు చూపారు హర్ష కుమార్. అయితే పవన్ తో భేటీ తరువాతే ఆయన ఎప్పుడు చేరేది తేలుతుంది.
అలా చేస్తే గుడ్ బై …
జనసేన జెండా కట్టేందుకు సిద్ధమౌతున్న మాజీ ఎంపి పవన్ కళ్యాణ్ బిజెపి తో కలిసి ప్రయాణిస్తే మాత్రం ఆ పార్టీలో చేరినా బయటకు వచ్చేయడం ఖాయమని ఆయన సన్నిహితులు అంటున్న మాట. ఈ విషయాన్ని తెలుగు పోస్ట్ నిర్ధారణ కోసం ఆయనతో ప్రస్తావించినప్పుడు అది నిజమే అని తేల్చారు హర్ష కుమార్. తన రాజకీయ జీవితం మొత్తం టిడిపి, బిజెపి వ్యతిరేకంగా సాగిందని మనసు చంపుకుని రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని హర్ష వెల్లడించారు. ఎన్నికలు ముందు కానీ తరువాత కానీ బిజెపి తో జనసేన అలయన్స్ పెట్టుకుంటే మాత్రం ఆ పార్టీ కి రామ్ రామ్ చెప్పేస్తానన్నారు ఆయన.
ప్రజారాజ్యాన్ని ఎదిరించి నిలిచి …
2009 ఎన్నికల్లో ఏ నియోజక వర్గంలో ఎలా వున్నా ప్రజారాజ్యం అమలాపురంలో ఎంపీ స్థానం సాధిస్తుందని ఎక్కువమంది అంచనా వేశారు. ఒక పక్క సొంత పార్టీలో వైఎస్ వర్గీయులతో పోరాటం చేస్తూ మరోపక్క బలమైన కాపు సామాజిక వర్గాన్ని ఆనాటి ఎన్నికల్లో ఒకేసారి ఎదుర్కొన్నారు హర్ష కుమార్. 2004 లో కన్నా అత్యధిక మెజారిటీతో గెలిచి అందరిని ఆశ్చర్య పరిచారు. తన సొంత వ్యూహాలతో ప్రత్యర్థులపై అనూహ్య విజయాన్ని మంచి మెజారిటీ తో సాధించిన హర్ష కుమార్ ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి ప్లస్ కానున్నారు. ఈ నేపథ్యంలో హర్ష నూతన రాజకీయం ఎలా వుండబోతుందో వేచి చూడాలి.
Leave a Reply