
పదిహేడో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలపై హస్తం పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇందుకు బలమైన కారణాలున్నాయి. గత ఏడాది చివర్లో జరిగిన ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలు లోక్ సభ ఎ్నికల్లనూ పునరావృతమవుతాయని హస్తం పార్టీ ఆశించింది. మధ్యప్రదేశ్ లో 29, రాజస్థాన్ లో 25, ఛత్తీస్ ఘడ్ లో 11 పార్లమెంటుస్థానాలున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. హస్తం పార్టీకి నిరాశజనక ఫలితాలొచ్చాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో వరుసగా పదిహేనేళ్ల నుంచి,రాజస్థాన్ లో ఐదేళ్ల పాటు కమలం పార్టీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని మొత్తం 65 లోక్ సభ స్థానాల్లో కనీసం సగానికి పైగా స్థానాల్లో పాగా వేస్తామని హస్తం పార్టీ ఆశించింది. కానీ ఫలితం మరోరకంగా ఉండటంతో ఊసూరుమంది.
ఒక్క సీటుతోనే……
మధ్యప్రదేశ్ లోని మొత్తం 29 స్థానాల్లో 28 స్థానాల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఒక్క చింద్వారా లో ముఖ్యమంత్రి కమల్ నాధ్ కుమారుడు నకుల్ నిచ్ గెలుపొందారు. మిగిలిన స్థానాలన్నీ కమలానికే వెళ్లాయి. కమలం ధాటికి తట్టుకోలేక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా పరాజయం పాలయ్యారు. గుణ నియోజకవర్గంలో ఆయనను బీజేపీ అభ్యర్థి కృష్ణ పాల్ సింగ్ ఓడించారు. రాజ కుటుంబానికి చెందిన సింధియా ఓడిపోవడం ఇదే ప్రధమం. పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన రాజకీయ దిగ్గజం దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో దారుణ ఓటమికి గురయ్యారు. ఆయనపై బీజేపీ నాయకురాలు ప్రజ్ఞాసింగ్ 3.64 లక్షల మెజారిటీతో గెలుపొందారు.
ఎడారి రాష్ట్రంలో…..
మరో కీలకరాష్ట్రం రాజస్థాన్. 2014 ఎన్నికలలో 55.6 శాతం ఓట్లతో మొత్తం 25 స్థానాలను గెలుచుకున్న కమలం పార్టీ ఈసారీ ఢంకా భజాయించింది. మొత్తం సీట్లన్నీ కమలం వశమయ్యాయి. 30.7 శాతం ఓట్లు సాధించిన హస్తం పార్టీ ఒక్క సీటునూ సాధించలేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలను హస్తం పార్టీ సాధించింది. ఆ లెక్కన చూసినా బీజేపీకి ఏడు, కాంగ్రెస్ కు కనీసం 11 సీట్లు రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ కనుమరుగైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం రాజేష్ పైలట్ ప్రభావం ఎంత మాత్రం పనిచేయలేదు. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీకి పది నుంచి పదకొండు స్థనాలు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీ వీటిని ఖండించింది. ఇరవై వరకూ సాధిస్తామని చెప్పుకుంది. తీరా ఫలితాలు చూసి కాంగ్రెస్ పార్టీ కంగుతినింది. కనీసం ఒక్క స్థానంలోనూ గెలవకపోవడం దానిన పూర్తిగా నిరాశపర్చింది.
పనితీరును బట్టేనా…?
ఛత్తీస్ ఘడ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్ల కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలకు గాను పది స్థానాలను సాధించింది. 49.7 శాతం ఓట్లు సాధించింది. 39.1 శాతం ఓట్లు సాధించి ఒక్క స్థానాన్నే కైవసం చేసుకుంది. కానీ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా పరాజయం పాలైంది. 2002 నుంచి వరసగా పదిహేను సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చతికల పడింది. ఈ లెక్కన ఈ సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ ఘన విజయం సాధించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమయింది. అనూహ్యంగా బీజేపీ 10 స్థానాలను సాధించింది. రైతులు, గిరిజనుల సంక్షేమం…వరికి మద్దతు ధర, గరిజనుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. బీజేపీ శ్రేణులు కూడా ఎన్నికలనున ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాయి. మొత్తానికి ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి స్థానిక నాయకత్వాలేకారణం తప్ప నరేంద్ర మోదీ పనితీరు కాదు. అదేవిధంగా జాతీయ స్థాయిలో మోదీ పాలన పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. అదే విధంగా గెలుపునకు పనీతీరు ప్రాతిపదిక తప్ప మరొకటి కాదని సాధికారికంగా రుజువైంది. ప్రజలు నాయకుల పనితీరును నిరంతరం గమనిస్తారన్నది స్పష్టమైంది. గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, జనతాదళ్ ఎ్ కలసి పోటీ చేసినా కమలాన్ని అడ్డుకోలేకపోయారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 లోక్ సభ స్థానాలకు గాను కమలం పార్టీ 17, కాంగ్రెస్ 9, జనతాదళ్ ఎస్ 2 స్థానాలను సాధించాయి. ఈసారి ఎన్నికల్లో కమలం తన బలాన్ని 25కు పెంచుకోవడం గమనార్హం. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ చెరో స్థానానికి పరిమితమయ్యాయి. ఆఖరుకు జనతాదళ్ ఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తుముకూరు నుంచి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి బసవరాజు ఆయనన 1,339 ఓట్లతో ఓడించారు. మాండ్యలో స్వతంత్ర అభ్యర్ది సుమలతకు బీజేపీ మద్దతు ఇచ్చి గెలిపించింది. 20 శాతం ఓట్లున్న లింగాయత్ లు రాష్ట్రంలో కమలం పార్టీకి దన్నుగా ఉండటంతో ఈ విజయం సాధ్యమయిందని విశ్లేషకుల అంచనా.
-ఎడిటోరియల్ డెస్క్
Leave a Reply