అంచనాలు తప్పుతున్నాయా….?

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజస్థాన్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇటు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతలు పార్టీని వీడుతుండటంతో మరింత దిగాలుపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ కు కూడా లోక్ తాంత్రిక్ మోర్చా పేరిట చిన్న పార్టీలన్నీ కూటమిగా ఏర్పడటంతో ఓట్లు చీలుతాయోమోనన్న బెంగ పట్టుకుంది. వాస్తవానికి ప్రస్తుతం జరగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘంటాపధంగా గెలిచేది రాజస్థాన్ అని నిన్న మొన్నటి వరకూ విశ్లేషణలు విన్పించాయి. అయితే రోజురోజుకూ జరుగుతున్న పరిణామాలతో వార్ వన్ సైడ్ కాదనిపిస్తోంది.

కష్టాల్లో కమలం…….

ముఖ్యంగా రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీకి ఎన్నికలకు ఆరు నెలల ముందునుంచే గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి వసుంధర రాజే ఒంటెత్తు పోకడల కారణంగా విసిగిపోయిన అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లారు. భారతీయ జనతా పార్టీ  అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరితో పాటు ప్రధాన సామాజిక వర్గాలైన రాజ్ పుత్, జాట్ లు పార్టీకి దూరమయ్యారు. ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ పార్టీని వీడటం పెద్ద దెబ్బేనన్నది విశ్లేషకుల అంచనా. జస్వంత్ సింగ్ ను రాజ్ పుత్ లు తమ లీడర్ గా చెప్పుకుంటారు. ఆయనను అంతగా వారు అభిమానిస్తారు. అయితే జస్వంత్ సింగ్ కు బీజేపీ చేసిన అవమానాలను రాజ్ పుత్ లు మర్చిపోలేక పోతున్నారు. దీంతో ఈ వర్గం బీజపీకి దూరమయినట్లేనని భావిస్తున్నారు. రాజ్ పుత్ లు దాదాపు 25 నుంచి 30 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశముంది.

దూరమవుతారా….?

మరోవైపు ఇక్కడ జాట్ లకు, రాజ్ పుత్ లకు పడదు. మానవేంద్ర సింగ్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ లో ఉన్న జాట్ సామాజిక వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమకు ప్రాధాన్యం తగ్గిపోతుందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. జాట్ సామాజిక వర్గం కూడా దాదాపు పది నుంచి పదిహేను స్థానాల్లో ప్రభావం చూపుతుంది. దీంతో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు దిగింది. జాట్ సామాజిక వర్గం నేతలతో చర్చలు ప్రారంభించింది. మానవేంద్ర సింగ్ రాకతో ఎలాంటి నష్టం జరగదని హామీ ఇస్తుంది.

ఇప్పటికే మాయావతితో….

ఇక కాంగ్రెస్ కు మరో సమస్య ఇక్కడ వచ్చి పడింది. నిన్నటి వరకూ రాజస్థాన్ ఖచ్చితంగా తమ ఖాతాలో పడితీరుతుందని భావించిన హస్తం పార్టీ నేతలు మూడో కూటమి రాకతో కొంత డైలమాలో పడ్డారు. ఇప్పటికే మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ విడిగా పోటీకి దిగుతోంది. ఇది కాకుండా లోక్ తాంత్రిక్ మోర్చా పేరుతో సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, జనతాదళ్, సీపీఐ, సీపీఎం వంటి చిన్న పార్టీలన్నీ కలసి 200 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదు. ఓట్ల చీలికతో తమకు నష్టం వాటిల్లుతోందన్న ఆందోళన రాజస్థాన్ కాంగ్రెస్ నేతల్లో స్పష్టంగా కన్పిస్తోంది. మరి చివరి నిమిషంలో ఈ ఎన్నికలు ఎవరి తలరాతను మార్చనున్నాయో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 35928 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*