హ్యాండ్ ఇస్తే ‘‘షేక్’’ అవుతుంది….!

కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తుల బెడద తప్పడం లేదు. ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ రాష్ట్ర అగ్రనేతలు గుర్తించారు. మంత్రి వర్గ విస్తరణ చేస్తామని చెప్పి మోసం చేసిందని పార్టీ అధిష్టానంపై కొందరు సీనియర్ నేతలు సయితం మండిపడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే అమాత్య పదవిని అందుకోవాలని భావిస్తున్న కొందరు నేతలకు అధిష్టానం తరచూ నిరాశ పరుస్తోంది. దీంతో తాము కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావుకు కొందరు సీనియర్ నేతలు సంకేతాలు పంపడంతో అగ్రనేతలు అలర్ట్ అయ్యారు.

కాచుక్కూర్చున్న కమలం….

తక్కువ బలంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కర్ణాటకలో బీజేపీ కాచుక్కూర్చుని ఉంది. లోక్ సభ ఎన్నికలు ఉండటంతో కాస్త తగ్గింది కాని లేకుంటే ఈ పాటికి కాంగ్రెస్ నేతలకు కమలం పార్టీ గాలం వేసేదే. ఎందుకంటే దాదాపు 20 మంది వరకూ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగలి పోతున్నారు. తొలుత రహస్య సమావేశాలను పెట్టుకున్న అసంతృప్త నేతలు ఇప్పుడు బహిరంగంగా మీటింగ్ లు పెట్టుకునే స్థాయికి వచ్చారు. కొందరు బీజేపీ నేతలతో టచ్ లోకి వీరు వెళ్లినా తమ పార్టీ కేంద్ర నాయకత్వం లోక్ సభ ఎన్నికలకు వరకూ ఆగమని స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పడంతో చేరికలు ఆగిపోయాయన్నది కాంగ్రెస్ అంచనాగా కూడా ఉంది.

రాహుల్ తో మంతనాలు….

దీంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ గురించే పరమేశ్వర్ రాహుల్ తో ప్రస్తావించే అవకాశముంది. అధిష్టానం మాత్రం లోక్ సభ ఎన్నికల వరకూ విస్తరణ చేయకూడదని భావిస్తోంది. కానీ అదే జరిగితే సార్వత్రిక ఎన్నికలలోపే ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే అవకాశముందని పరమేశ్వర్ చెప్పేందుకే హస్తినకు ప్రయాణమయ్యారన్న టాక్ కూడా విన్పిస్తోంది. కొద్దిరోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా విస్తరణ ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పదవుల భర్తీపైనా…..

స్థానిక సంస్థల గడువు ముంచుకొస్తున్నా అసంతృప్త నేతలు పెద్దగా పట్టించుకోక పోవడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణతో పాటుగా ఖాళీగా ఉన్న వివిధ కార్పొరేషన్ల పాలకమండలి నియామకంపై కూడా పరమేశ్వర్ రాహుల్ తో చర్చించనున్నారు. అంతేకాకుండా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా పరమేశ్వర్ రాహుల్ తో చర్చించనున్నారు.అభ్యర్థుల ఎంపిక, జేడీఎస్ తో పొత్తు తదితర అంశాలపై కూడా వీరి బేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముందంటున్నారు. మరి అసమ్మతి భగ్గుమనకుండా విస్తరణకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 19163 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*