ట్రెండ్ మార్చిన హస్తం….!!!

indian national congress party in telangana

కాంగ్రెస్ లో కొత్త ట్రెండ్ కనపడుతోంది. పార్టీలో క్రమశిక్షణ పట్టు తప్పుతుందని గ్రహించింది. పార్టీ నేతల మధ్య వైరుధ్యాల కారణంగానే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూడటానికి ఒక కారణంగా అధిష్టానం గుర్తించింది. అందుకే ఇకపై పార్టీ ముఖ్యనేతలపైన విమర్శలు చేసే వారిని ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆధిపత్య పోరు కామన్ గా కనపడుతుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత క్రమశిక్షణపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనపడుతోంది.

సర్వే సస్పెన్షన్ పై…..

ఇటీవల మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సస్పెన్షన్ ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. గతంలో ఎవరు ఏమి మాట్లాడినా షోకాజ్ నోటీసులిచ్చి సరిపెట్టేవారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి రామచంద్ర కుంతియా, పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కటువైన వ్యాఖ్యలే చేశారు. అయితే అప్పట్లో ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరి వదిలేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎటువంటి సస్పెన్షన్ వేటు వేయలేదు.

అధిష్టానం సూచనలతోనే…..

కానీ తాజాగా సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వెనువెంటనే వేయడానికి కారణం అధిష్టానమేనని చెబుతున్నారు. అసలే ఓటమితో కుంగిపోయి ఉన్న క్యాడర్ ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు. సర్వే సత్యనారాయణకు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చి వదిలేసి ఉంటే కాంగ్రెస్ లో మరిన్ని గొంతుకలు లేచేవి. అందుకే పార్లమెంటు ఎన్నికల సమయంలో నేతలు మరింత చికాకు కల్పించకుండా ఉండేందుకే సర్వే సత్యనారాయణపై వేటు వేశారంటున్నారు. సర్వే సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేస్తారన్న విషయం పక్కన పెడితే కనీసం వివరణ కోరకుండా ఇక్కడి క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది.

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో….

రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఈ చర్యకు రాష్ట్ర నేతలు దిగారంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వదలబోమంటూనే రాహుల్, సోనియాలను తప్పించి ఎవరినీ వదలకుండా విమర్శిస్తూ ఉన్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తుపై కటువైన వ్యాఖ్యలే చేశారు. ఆయనపై చర్య తీసుకోకుండా సర్వే సత్యనారాయణపై చర్యలు తీసుకోవడమేంటన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. కానీ కేంద్ర మాజీ మంత్రి స్థాయిలో ఉన్న సర్వే సత్యనారాయణపై వేటు వేస్తే మిగిలిన నేతలు విమర్శించడానికి వెనుకాడతారని, పార్లమెంటు ఎన్నికలకు విభేదాలు లేకుండా వెళ్లవచ్చన్నది అధిష్టానం ఆలోచనగా కన్పిస్తుంది. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో ట్రెండ్ మారిందంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 41253 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*