
రాజకీయాలకు కేరాఫ్ గా ఉండే సీమలో అత్యంత చైతన్యవంతమైన జిల్లా కర్నూలు. గతంలో సీఎంలను సైతం అందించిన ఈ జిల్లా.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. అయితే, మారిన రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టుకొచ్చిన టీడీపీ ప్రభావంతో ఇక్కడ కాంగ్రెస్ కుదేలైంది. అయితే, వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తిరిగి ఇక్కడ కాంగ్రెస్ బాగా బలం పుంజుకుంది. వైఎస్ ప్రభావంతో ఇక్కడ టీడీపీ నుంచి నేతల వలసలను ప్రోత్సహించారు. దీంతో చాలా మంది టీడీపీకి రాం రాం చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని మొత్తం 14 నియోజవకర్గాల్లో గతంలో కాంగ్రెస్ మేజర్ సీట్లను కైవసం చేసుకునేది. అదేవిధంగా నంద్యాల, కర్నూలు ఎంపీ సీట్లను సైతం కాంగ్రెస్ బుట్టలో వేసుకునేది. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ చేతులు ఎత్తేసింది. ఇక 2009లో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు, అటు ప్రజారాజ్యం ఎంట్రీతో టీడీపీకి చెందిన పలువురు కీలక నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
వరుస ఎదురుదెబ్బలతో…..
వరుస ఎదురు దెబ్బలతో టీడీపీ ఓటు బ్యాంకు ఇక్కడ బాగా తగ్గిపోయింది. చివరకు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. ఇలా వైసీపీ ఆవిర్భావం ముందు వరకు జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా భారీ ఎత్తున సాగేది. అయితే, 2014 విభజన ఎఫెక్ట్, పైగా కాంగ్రెస్‌పై దండెత్తిన వైఎస్ జగన్ సొంత కుంపటి పెట్టుకోవడం వంటి కారణాలతో ఇక్కడ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో దెబ్బతింది. అయితే, దివంగత కోట్ల విజయభాస్కర్ వంటి సీనియర్ ఫ్యామిలీలు మాత్రం కాంగ్రెస్ తోనే ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో ఆఫర్లు వచ్చినా కూడా కోట్ల ఫ్యామిలీ కాలు బయటకు పెట్టలేదు. అయితే, అన్నీ ఇలాంటి ఫ్యామిలీలే ఉన్నాయని చెప్పలేం. ఇక, వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అనేక హామీలతో ముందుకు వస్తోంది. పోయిన ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవడం సహా.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని నిర్ణయించే స్థాయికి కూడా ఎదగాలని నిర్ణయించుకుంది.
ఈ నెల 18న రాహుల్……
ఈ క్రమంలోనే తాజాగా పార్టీ అధినేత రాహుల్‌తో ఇక్కడ పర్యటన ఏర్పాటు చేయించేందుకు ప్లాన్ చేసుకుంది. గత ఎన్నికలకు ముందు ఆ తర్వాత చాలా జిల్లాల్లో బలమైన నాయకులు తమ దారి తాము చూసుకున్నారు. ఇప్పటకీ కర్నూలు జిల్లాలో బలమైన ఫ్యామిలీగా పేరున్న కోట్ల ఫ్యామిలీ మాత్రమే కాంగ్రెస్‌లో ఉంది. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. ఒక్క సీటు గెలుచుకోలేదు సరికదా… పట్టుమని పదిమంది లీడర్లకు కూడా డిపాజిట్లు రాలేదు. అయితే కర్నూలు ఎంపీగా పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి 1.16 లక్షల ఓట్లతో ఏపీలోనే ఏ కాంగ్రెస్ అభ్యర్థికి రానన్ని ఓట్లు తెచ్చుకున్నారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత చరిష్మా , జిల్లాలో వాళ్లకు ఉన్న పట్టు వల్లే సాధ్యమైంది.
సుజాతమ్మ కూడా…..
ఇక ఆలూరు నుంచి పోటీ చేసిన కోట్ల సతీమణి కోట్ల సుజాతమ్మ 22 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ దక్కించుకున్నారు. అలాగే పత్తికొండలో కోట్ల అనుచరుడిగా పోటీ చేసిన కె.లక్ష్మీనారాయణ రెడ్డి ఏకంగా 31 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ దక్కించుకున్నారు. దీనిని బట్టి ఇక్కడ కోట్ల ఫ్యామిలీకి ఉన్న పట్టు వల్ల కాంగ్రెస్ కాస్తో కూస్తో బలంగా ఉందని అర్థమవుతోంది. ఇక ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలు పర్యటన కూడా వ్యూహాత్మకంగానే ఉన్నట్టు అర్థమవుతోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 రోజుల్లో ప్రత్యేక హోదాతో పాటు, రైతులకు రుణ మాఫీ చేయాలని రాహుల్ ఆలోచిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వయంగా రాహుల్ ఏపీ వేదికగా ప్రత్యేక హోదా సహా పార్టీ వ్యూహాన్ని ఆవిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో సెప్టెంబరు 18న కర్నూలులో పర్యటన నిమిత్తం రాహుల్ వస్తున్నారు. విభజన హమీలను నెరేవేరుస్తామని విస్పష్టంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చే క్రమంలోనే రాహుల్ గాంధీ కర్నూలు పర్యటన అని స్పష్టంగా తెలుస్తోంది. మరి రాహుల్ ఏమేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి.
Leave a Reply