
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి చివరకు కాంగ్రెస్ పార్టీయే నిలబెట్టాల్సి వచ్చింది. విపక్షాల్లో ఏ ఒక్క పార్టీ తమ అభ్యర్థిని నిలబెడతామని ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ తప్పనిసరిగా అభ్యర్థిని ప్రకటించాల్సి వచ్చింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్ పేరును ఆ పార్టీ చివరి నిమిషంలో ఖరారు చేసింది. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థిగా హరివంశ్ నారాయణ్ సింగ్ ను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. రేపు జరగబోయే ఎన్నికల్లో విపక్షాల ఐక్యత ఏంటో? బీజేపీ బలం ఏంటో తెలిసిపోతుంది. రెండు పక్షాలూ గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
తొలుత విపక్షాల నుంచీ…..
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి తొలుత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షాల్లో ఏదో ఒక పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించడమే మేలని భావించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు సంప్రదింపుల మీద సంప్రదింపులు జరిపారు. కాని ఫలితం లేకుండా పోయింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అయితే వామపక్షాలు మద్దతిచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే ఎస్పీ, బీఎస్పీ నుంచి కూడా ప్రతిపాదన కోరారు. ఆపార్టీలు కూడా తాము అభ్యర్థిని నిలబెట్టలేమని చెప్పడంతో చివరకు కాంగ్రెస్ బీకే హరిప్రసాద్ పేరును ఖరారు చేయాల్సి వచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్థి కావడంతో…..
బీకే హరిప్రసాద్ కర్ణాటకకు చెందిన వారు. సీనియర్ నేత కావడంతో ఆయన పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే దక్షిణాదిన ఉన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థికే తమ ఓట్లు వేస్తామని చెప్పింది. అప్పటికి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పోటీకి దిగుతారని టీడీపీ భావించింది. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుడే పోటీకి దిగడంతో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించిందన్న కాంగ్రెస్ కు మద్దతిస్తే చంద్రబాబుకు మైనస్ అవుతుందని కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బలమున్నా…….
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చే ప్రసక్తి ఉండకపోవచ్చు. ఆయన ఎన్డీఏ తరుపున పోటీ చేస్తున్న జేడీయూ అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్ కే మద్దతిస్తారంటున్నారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోన్ చేసి మద్దతు కోరడంతో ఆయన మెత్తపడ్డారు. అందుతున్న సమాచారం ప్రకారం జేడీయూ అభ్యర్థికే బీజేడీ మద్దతిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకు 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 123 కావడంతో 12 మంది సభ్యులున్న అన్నాడీఎంకే, 9 మంది సభ్యులున్న బీజేడీ, ఆరుగురు సభ్యులున్న టీఆర్ఎస్ వంటి పార్టీలు మద్దతు ఇస్తే గెలుపు సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తుంది. అలాగే 112 మంది సభ్యులున్న విపక్షాలకు ఎవరు మద్దతిస్తారన్న దానిపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. కాని గణాంకాలను బట్టి చూస్తే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు.
Leave a Reply