కాంగ్రెస్ మళ్లీ అదే తప్పు చేస్తుందా?

కాంగ్రెస్ పార్టీ సొంతంగా చేయించుకున్న సర్వేల్లో తెలంగాణలో ఖచ్చితంగా గెలుస్తుందన్న ఫలితాలు రావడంతో ఆ పార్టీ ఉత్సాహంలో ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే ఈ విషయాన్ని స్వయంగా నేతలతో చెప్పడంతో రెట్టింపు ఉత్సాహంతో వారు హస్తిన నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. కాని కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి నాయకత్వం అవసరమన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ లో నాయకత్వం లోపం స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావును ధీటుగా ఎదుర్కొనే నాయకుడు కాంగ్రెస్ లో లేరన్నది వాస్తవం.

కుంతియాతో అయ్యే పనేనా…?

నిన్న మొన్నటి వరకూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ ఉండేవారు. అయితే దిగ్విజయ్ సింగ్ ను తప్పించి ఏడాది క్రితం రాహుల్ గాంధీ రామచంద్ర కుంతియాను నియమించారు. కుంతియాను తొలుత తాత్కాలకి ఇన్ ఛార్జిగానే నియమించారు. అయితే ముందస్తు ఎన్నికలు రావడంతో కుంతియానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా వ్యవహరించనున్నారు. కుంతియాకు సహాయకులుగా ముగ్గురు కార్యదర్శులను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. కుంతియా ఇన్ ఛార్జిగా కొనసాగడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్ అన్నది కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతుండటం విశేషం.

గ్రూపు విభేదాలకు చెక్ పెట్టాలంటే…..

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు ఎక్కువ. ఒకరంటే మరొకరికి పడదు. ఆధిపత్య పోరుతో ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కు పూర్తి స్థాయి ఇన్ ఛార్జిగా గులాం నబీ ఆజాద్, ఆంటోని వంటి వారిని నియమిస్తే పరిస్థితి చక్కపడుతుందన్నది కొందరి వాదన. ఆజాద్ లాంటి వారు ఉంటే నేతలు క్రమశిక్షణతో మెలుగుతారు. ఒకవేళ ఎక్కడైనా విభేదాలు తీవ్రస్థాయిలో తలెత్తితే దాన్ని వెంటనే పరిష్కరించగలిగిన సామర్థ్యం ఆజాద్ వంటి నేతలకే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఆజాద్ కు పూర్తి అవగాహన, పట్టు ఉందని, ఆయనను నియమించాలని ఇటీవల రాహుల్ తో భేటీ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతలు కోరినట్లు సమాచారం.

పొత్తులు కూడా ఉన్నాయి……

గ్రూపు తగాదాలతో పాటు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పొత్తుల అంశం కూడా ప్రధానంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, సీపీఐ, తెలంగాణ జనసమితి తో చర్చలు ఫలప్రదం కావాలంటే ఆజాద్ లాంటి నేతలు అవసరమంటున్నారు. ఎన్నికల వ్యూహరచన, ప్రచార వ్యూహాలను కూడా ఆజాద్ సమర్థవంతంగా నిర్వహించగలరని చెబుతున్నారు. కుంతియాతోనే ఎన్నికలకు వెళితే మళ్లీ గత ఎన్నికల ఫలితాలు రిపీట్ అవ్వకతప్పదని బహిరంగంగానే చెబుతున్నారు. మరి కాంగ్రెస్ నేతల అభిప్రాయంపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 37162 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*