“పంట” పండినట్లేనా…?

indiannationalcongres alliancein maharashtra

సంపన్న రాష్ట్రం, పెద్దరాష్ట్రమైన మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉంది. 80 లోక్ సభ స్థానాలుగల ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలతో ఈ రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉంది. అందువల్ల ఇక్కడి ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. దీంతో సహజంగానే అన్ని పార్టీల దృష్టి ఈ పశ్చిమ ప్రాంత రాష్ట్రంపైనే ఉంటుంది. రెండు జాతీయ, రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి. అఖిల భారత కాంగ్రెస్ తో పాటు భారతీయ జనతా పార్టీలకు రాష్ట్రంలో మంచి పట్టుంది. అదే సమయంలో శివసేన, శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కూడా బలంగానే ఉండటం విశేషం. ఏ ఒక్క పార్టీ రెండో పార్టీని విస్మరించినా దాని ఫలితం ఎన్నికలపై గణనీయంగా ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఓటర్లు మెజారిటీ సీట్లను కట్టబెట్టలేదు. హంగ్ అసెంబ్లీలే ఏర్పడుతున్నాయి. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాలు మాత్రం ఒకింత భిన్నంగా ఉంటున్నాయి.

ముందే జట్టుకట్టి….

ఈ నేపథ్యంలో ముందే మేల్కొన్న కాంగ్రెస్, పవార్ సారథ్యంలోని ఎన్సీపీ తో జట్టుకట్టింది. తద్వారా ఎన్నికలకు సమాయత్తమయింది. మొత్తం 48 స్థానాలులకు గాను 45 స్థానాలకు సంబంధించి సర్దుబాటు కుదిరింది. రెండు పార్టీలు చెరిసగం స్థానాల్లో పోటీ చేస్తాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని పవార్ అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతానికి 45 స్థానాలపై అవగాహన ఏర్పడింది. మిగిలిన మూడు స్థానాలపై కూడా త్వరలో నాయకులు చర్చించి అవగాహనకు రానున్నారు. తమకు కేటాయించిన సీట్లలో చిన్న పార్టీలకు సీట్లు ఇస్తామని పవార్ చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తన కోటా నుంచి వామపక్ష పార్టీలకు సీట్లను కేటాయించనుంది. రాజ్ థాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎన్ఎస్) తో పొత్తు ఉండదు. రాజ్ థాక్రే తో పవార్ కొంతకాలం క్రితం చర్చలు జరపడంతో ఆ పార్టీతో పొత్తు ఉంటుందన్న ఊహాగానాలు వ్యాపించాయి. అయితే థాక్రే తో భేటీ వ్యక్తిగతమైందని రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని పవార్ స్పష్టం చేయడంతో ఈ చర్చకు తెరపడింది. కాంగ్రెస్ తోనే కాకుండా ఇతర చిన్నా చితకా పార్టీలతో చర్చలు జరిపి మహాకూటమిని నిర్మించాలన్న యోచనలో పవార్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విష‍యంలో స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

కేటాయించిన స్థానాల్లో….

తనకు కేటాయించిన సీట్లలోఒక్క స్థానాన్ని స్వాభిమాన్ షేత్కారీ సంఘటన్ పార్టీకి ఎన్సీపీ కేటాయించనుంది. రాజుశెట్టి సారథ్యంలోని ఈ పార్టీకి కొల్హాపూర్ జిల్లాలోని “హత్కానంగ్లే” స్థానాన్ని ఇవ్వనున్నట్లు పవార్ స్వయంగా వెల్లడించారు. వాస్తవానికి ఈ పార్టీ గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉంటే.. ఆ పార్టీ తర్వాత ఎన్టీఏ కూటమి నుంచి వైదొలగింది. ప్రస్తుతం పవార్ పార్టీతో కలసి పనిచేస్తోంది. ఈ పార్టీ వార్థా స్థానాన్ని కూడా కోరుతోంది. అయితే ఈ స్థానం పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కు వెళ్లిందని ఎన్సీపీ చెబుతోంది. ఇక కాంగ్రెస్ గుంభనంగా వ్యవహరిస్తోంది. పొత్తుల పరంగా పార్టీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. అయినప్పటికీ పొత్తు వాస్తవమేనని, పార్టీ అధ్యక్షుడు ఆమోద ముద్ర వేశారని హస్తం పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ వంటి వామపక్ష పార్టీలతో పాటు బహుజన్ వికాస్ అఘాజీ పార్టీతోనూ కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతోంది. కాంగ్రెస్ ఇతర పార్టీలతో చర్చించినప్పటి్కీ కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య కుదిరిన ఒప్పందం మారదు. తమకు కేటాయించిన సీట్లలో నుంచి వాటికి కొత్తగా కేటాయించవలసి ఉంది. ఈ విషయంలో రెండు పార్టీలూ స్పష్టతతో ఉన్నాయి.

గత ఎన్నికల్లో …..

2014 లోక్ సభ ఎన్నికల పరంగా చూస్తే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఇక్కడ చావుదెబ్బ తినింది. కాంగ్రెస్ కేవలం రెండు, ఎన్సీపీ నాలుగు స్థానాలకే పరిమితమయ్యాయి. హింగోలి, నాందేడ్ లలో మాత్రమే హస్తం విజయం సాధించింది. నాందేడ్ పీసీసీ చీఫ్ అశోక్ చావ్లా స్వస్థలం. ఆది నుంచి ఇది కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం. ఎస్.బి. చవాన్ హయాం నుంచి ఇక్కడ హస్తం ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎస్.బి.చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, పీవీ హయాంలో కీలకమైన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. పవార్ పార్టీ సతారా, బారామతి, కొల్లాపూర్, మధ స్థానాలను గెలుచుకుంది. పవార్ స్వస్థలమైన బారామతి నుంచి ఆయన కూతురు సుప్రియా సూలే ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి ఘన విజయంసాధించింది. బీజేపీ 23, శివసేన 18 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ నుంచి శివసేన బయటకు రాకపోయినప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య ఉప్పు, నిప్పు గా ఉంది. తన కుమారుడి వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా శివసేన అధిపతి ఉద్ధవ్ థాక్రే ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి పొత్తు పండినట్లే. దీనికి తోడు గత అయిదేళ్లుగా కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. దీంతో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత తో పాటు సేన-బీజేపీ ల మధ్య ఓట్లు చీలి కాంగ్రెస్, ఎన్సీపీ భారీగా లబ్ది పొందే అవకాశాన్ని తోసిపుచ్చలేం.

 

ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 41286 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*