ఇంతకూ వైసీపీ ఎమ్మెల్యే గెలిచినట్లేనా …?

is-ysrcongress-mla-winner

అనంతపురం జిల్లా మడకశిర టిడిపి ఎమ్యెల్యే వీరన్న ఎన్నిక చెల్లదని హై కోర్టు మరో నాలుగు నెలల్లో ఆయన పదవీకాలం పూర్తి అవుతుందనగా తీర్పు చెప్పింది. ఇప్పుడు ఆయన స్థానంలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ తిప్పేస్వామి ఎమ్యెల్యే అయ్యారు. ఇదంతా బాగానే వున్నా వీరన్న కోర్టు దగ్గర ఘొల్లుమంటే తిప్పేస్వామి ఇంటికి వెళ్లి బోరుమనాలి. నాలుగున్నరేళ్ళకు పైగా పదవిలో వున్నా అపఖ్యాతితో ఒకరు వేదన చెందాలిసి వస్తే, కోర్టు చెప్పిన న్యాయం జరిగిందా తిప్పేస్వామికి అంటే ఆయనకే అర్ధం కానీ పరిస్థితి. నాలుగునెలల కాలం ఎమ్యెల్యే గా ఉండి ఆనంద పడాలో? బాధపడాలో ఆయనకే తెలియదు. ఇంకా వీరిద్దరి కేసులు కొద్దిగా గుడ్డిలో మెల్ల అనే చెప్పాలి. ఈ తరహా కేసుల్లో పదవీకాలం పూర్తి అయినా కూడా కేసులు నడుస్తున్నవి వున్నాయి.

ఓడి గెలిచారా ..? గెలిచి ఓడుతున్నారా..?

అత్యంత నిదానంగా వచ్చే న్యాయస్థానాల తీర్పులతో కక్షిదారులు కోర్టు లపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. బలవంతులు, ధనవంతులకే కోర్టు లు తమ అపరిమిత ఆలస్యంతో న్యాయం చేస్తాయా అంటే అవుననే అంటున్నారు సామాన్యులు. కోర్టు లను అడ్డుపెట్టుకుని పదవులనే కాదు టెండర్లను సైతం అధిక ధరకు కోడ్ చేసి రూపాయి కట్టకుండా కోర్టు కు ఎక్కి కొత్త తరహా వ్యాపారాలు సైతం ఇటీవల మొదలైయ్యాయి. అంటే అధికారం, డబ్బు వున్న వారు న్యాయస్థానాలను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారో తెలిసిపోతుంది. అత్యంత బలంగా నిర్మించిన భారత న్యాయవ్యవస్థ నిర్మాణం లోని లొసుగులు ఇప్పుడు అక్రమార్కుల పాలిట వరాలుగా మారుతున్నాయి. పవిత్రమైన న్యాయ వృత్తి చులకనగా మారిపోవడం ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరుస్తుంది.

విభజన కేసు ఇప్పటివరకు అతీగతీ లేదు …

ఏపీ విభజన అశాస్త్రీయంగా చేస్తున్నారు… ఆపండి అంటే అది ప్రిమెట్చ్యూర్ అని కోర్టు నిదానం అంది. అయ్యాక అడ్డగోలు విభజన చేశారు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఘోరం చూడండి అంటే అయిపొయింది కదా నెమ్మదిగా చూద్దాం అని ఇప్పటికి సాగదీస్తుంది. న్యాయ వ్యవస్థ పనితీరుకు ఇదో మచ్చుతునక. కొన్ని ప్రజలకు అత్యంత అవసరమని భావిస్తే ప్రత్యేక కోర్టు లు ఏర్పాటు చేసి సత్వర న్యాయం జరిగేలా చూడాలి.

బాలకృష్ణ కేసు యమా స్పీడ్ …

గతంలో సినీ నటుడు బాలకృష్ణ కాల్పుల కేసులో విచారణ జరిగిన స్పీడ్ మాములుగా లేదన్నది అందరు స్వయంగా చూసిందే. సెలబ్రిటీ హోదా తో ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా బెల్లంకొండ సురేష్ పై జరిగిన హత్యాయత్నం కేసు ఎలా వీగిపోయిందన్నది తెలిసిందే. చాలా జైళ్లల్లో వున్న శిక్ష పడ్డ ఖైదీలను కదిలిస్తే వారు చెప్పేది ఒక్కటే తమకు కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు కేసును సాగదీసి ఆర్ధిక స్థోమత లేక శిక్షాకాలం పూర్తి చేస్తున్నట్లు చెబుతారు. లేదంటే బతికున్నంత కాలం మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు సాగదీస్తే చాలని తమ జీవితకాలం పూర్తి అయిపోతుందని చెప్పడం గమనిస్తే అందులో వాస్తవమే అని సామాన్యులు నిర్ధారించే పరిస్థితి.

న్యాయమూర్తుల కొరత … అసౌకర్యాల లేమి …?

దేశ జనాభాకు అనుగుణంగా వుండాలిసిన కోర్టు లు లేవు. కోర్టు భవనాలు లేవు. పదవీవిరమణ పూర్తి అయితే కనీసం ఆ న్యాయమూర్తుల భర్తీ ని పట్టించుకునే పరిస్థితి లేనేలేదు. ఇక సుప్రీం కోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్కడి న్యాయమూర్తులే జరుగుతున్న ఘోరాలు రోడ్డెక్కి చెప్పుకొచ్చారు. ఒక సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి ఒకరు సాక్షాత్తు ప్రధాని ఎదుటే కంట తడి పెట్టుకుని ఖాళీలు భర్తీ చేయాలని వేడుకున్నారంటే న్యాయవ్యవస్థను రాజకీయ పార్టీలు ఎలా బలహీనపరుస్తున్నాయో తేటతెల్లం అవుతుంది.

సోషల్ మీడియా లో విమర్శల వెల్లువ …

సోషల్ మీడియా లో ఏ చిన్న హాట్ న్యూస్ దొరికినా ఐటెం సాంగ్ లా మారిపోతుంది. న్యాయ వ్యవస్థ తీరుపైనా నెటిజెన్స్ బాహాటంగా విమర్శలు ఆరోపణలు గుప్పించడం ఇటీవల బాగా పెరిగిపోయింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు న్యాయం కావాలంటూ దేశ ప్రజలను వేడుకున్నప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ ల తీర్పులపై నిస్సంకోచంగా అంతా విమర్శల దాడి సాగిపోతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టిన ప్రధాన స్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థ పై కూడా బురద పడటం దేశానికి మంచిది కాదన్న ప్రజాస్వామ్య వాదుల ఆందోళన ఎప్పటికి తగ్గుతుందో చూడాలి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1795 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*