జగన్ కాన్ఫిడెన్స్ చూశారా?

కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నానని, ప్రతిపక్ష నేతగా, ఎంపీగా పదేళ్ల ప్రజాజీవితం ద్వారా ప్రభుత్వాన్ని నడిపించడానికి కావాల్సిన అనుభవం సాధించానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా తనకు పరిపాలనా అనుభవం లేదనడం సరికాదని ఆయన అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

2019 ఎన్నికల్లో మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ?

2014 బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీ సైకిల్ కి రెండు చక్రాల లాగా పనిచేశారు. వారు ముగ్గురూ కలిసి పోటీ చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ కంటే కేవలం 1.5 శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నా వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. పైగా బీజేపీ, జనసేన కూడా ఇప్పుడు బాబును వ్యతిరేకిస్తున్నారు. వీటిన్నిటి ప్రభావం ఈ ఎన్నికల్లో ఉంటుంది. కచ్చితంగా మేము విజయం సాధిస్తాం.

బీజేపీతో బాబు ఎందుకు తెగదెంపులు చేసుకున్నారు ?

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నేపం నెట్టడం చంద్రబాబు నైజం. 2016 జనవరి 27న బీజేపీ రాష్ట్రానికి మేలు చేసిందని స్వయంగా చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత నెలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. 2016 సెప్టెంబర్ 8న చంద్రబాబు అంగీకారంతో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు అసెంబ్లీలో ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇప్పుడు బీజేపీతో సంబంధాలు తెంచుకుని తన వైఫల్యాలను ఆ పార్టీపైకి నట్టేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తున్నారు.

ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి మేలు జరుగుతుంది ?

రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ద్వారా ఇన్ కం ట్యాక్స్, జీఎస్టీ మినహాయింపులు వస్తాయి. దీంతో పరిశ్రమలు, హోటళ్లు, హాస్పిటళ్లు వంటివి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చేపిస్తాయి. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పోల్చుకుని వాటిల్లోనే పెట్టుబడులు పెడతారు. కాబట్టి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా ముఖ్యం.

ఎవరికి మద్దతు ఇస్తారు ?

ఈ విషయంలో మొదటినుంచీ మేము ఓకే మాట మీద ఉన్నాం. మాకు ప్రధానిగా నరేంద్ర మోదీ అయినా రాహుల్ గాంధీ అయినా ఒకటే. మా రాష్ట్రానికి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మా మద్దతు ఉంటుంది. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అంటున్నా, గత అనుభవాల దృష్ట్యా ఎవరినీ నమ్మలేం.

బీజేపీకి మీకు రహస్య ఒప్పందంపై…?

మాకు ఎవరితో ఎటువంటి ఒప్పందాలు లేవు. బీజేపీకి అంశాలవారీగా కొన్నిసార్లు వ్యతిరేకించాం. కొన్నిసార్లు మద్దతిచ్చాం. భూసేకరణ బిల్లు విషయంలో బీజేపీని వ్యతిరేకించాం. రాజ్యాంగ పదవులు ఏకగ్రీవం కావాలనేదే మా విధానం. అందుకే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ కి మద్దతిచ్చాం. అసెంబ్లీ స్పీకర్ కోసం టీడీపీకి కూడా మద్దతిచ్చాం. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలతో అవగాహనతో ఉన్నారు.

మీకు పరిపాలన అనుభవం లేదని మీ వ్యతిరేకులు అంటున్నారు.

నేను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాను. ఇప్పుడు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నాను. పదేళ్ల నా ప్రజాజీవితాన్ని ఎలా కాదంటారు..? ప్రస్తుతం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను. నా కుటుంబంతో కంటే ఎక్కువగా ప్రజలతోనే ఉంటున్నాను. మరోపక్క తొమ్మిది సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు రాష్ట్రానికి వరస్ట్ సీఎంగా మగిలిపోయారు.

మీకు ఏపీలో ప్రభుత్వం ఏర్పడేందుకు కొన్నిసీట్లు తక్కువ వచ్చి, బీజేపీ కొన్నిసీట్లు గెలిస్తే, ఆ పార్టీ మద్దతు కోరుతారా ?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటువంటి తీర్ప ఇవ్వరు. ఎవరు అధికారంలో ఉండాలో స్పష్టమైన తీర్పు చెబుతారు. కాబట్టి, మెజారిటీ రాదనే ప్రశ్నే ఉండదు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*