జగన్ పార్టీ నుంచి మరో బుల్లెట్ బయటకు వస్తుందా?

జగన్

ప్రత్యేక హోదా పోరులో ఇప్పటి వరకూ ముందున్న వైసీపీ మరో వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్లమెంటు సభ్యులు ఐదుగురు రాజీనామా చేసినా వారి రాజీనామాలు ఇంతవరకూ ఆమోదం పొందలేదు. దీంతో బీజీపీ, వైసీపీ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయని టీడీపీ పెద్దయెత్తున ప్రచారం ప్రారంభించింది. ఈ నెల 6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా ఎందుకు ఆమోదం పొందలేదన్నది టీడీపీ ప్రశ్న. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు సమర్పించామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారని, కాని వారి రాజీనామాలు మాత్రం స్పీకర్ పట్టించుకోవడం లేదన్న విమర్శలను టీడీపీ చేస్తోంది.

ఎమ్మెల్యేలందరూ…..

అయితే ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ అధినేత జగన్ మరో నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందలేక పోవడానికి కారణాలు స్పీకర్ నే అడిగి తెలుసుకోవాలని ఒకవైపు విమర్శలకు సమాధానం చెబుతూనే, మరోవైపు ఎమ్మెల్యేల చేతకూడా రాజీనామాలు చేయించలని జగన్ భావిస్తున్నారు. ఈమేరకు కొందరు ఎమ్మెల్యేల అభిప్రాయం ఆయన తీసుకున్నట్లు తెలిసింది. జగన్ శిబిరంలో కలసిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తేనే ప్రత్యేక హోదా విషయంలో మరింత ముందున్నట్లు అవుతుందని అభిప్రాయపడినట్లు సమాచారం.

రెడీ అంటున్న ఎమ్మెల్యేలు….

ఎంపీల రాజీనామాలంటే లోక్ సభ స్పీకర్ చేతులో ఉంటాయి. కాని ఇక్కడ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఏపీ శాసనసభ స్పీకర్ దానిని ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదింప చేసుకుని ఉప ఎన్నికలకైనా వెళదామని కొందరు ఎమ్మెల్యేలు జగన్ వద్ద గట్టిగానే చెప్పారట. అయితే అందరు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే రాజీనామాలు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పుడు ఎటూ అసెంబ్లీని బహిష్కరించి ప్రజాక్షేత్రంలోనే జగన్ ఉంటున్నారు. ఇక ఏడాది మాత్రమే గడువు ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడిగా రాజీనామాలు చేయడమే మేలన్న ఆలోచనలో అధినేత ఉన్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఆ నిర్ణయం ఎప్పుడైనా రావచ్చని, వైసీీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి రెడీగా ఉన్నారని ఆయన అన్నారు. మొత్తం మీద జగన్ తన అమ్ముల పొది నుంచి మరో అస్త్రాన్ని బయటకు తీసేందుకు రెడీ అవుతున్నారన్నమాట.

Ravi Batchali
About Ravi Batchali 32504 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*