ఆళ్లకు అండగా జగన్

తనకు నమ్మకంగా నిలిచిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అండగా నిలిచేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలోకి చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గం గత ఎన్నికలలో వైసీపీయే విజయం సాధించింది. అయితే అతి స్వల్ప మెజారిటీతో ఏదో బయటపడ్డామంటే బయటపడ్డామన్న తరహాలో వైసీపీ గత ఎన్నికల్లో నెగ్గింది. ఈసారి ఎన్నికల్లో అధిక ఓట్లతో విజయం సాధించాలన్నది వైసీపీ వ్యూహం. ఇందుకోసం జగన్ పాదయాత్రను ఉపయోగించుకోవాలని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుండటం, ప్రత్యేక హాదా సాధనలో వైసీపీయే ముందుండటం తమకు కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

టీడీపీ ఇక్కడ ఒక్కసారే…..

1962లో మంగళగిరి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ వామపక్ష పార్టీలకూ పట్టుంది. 1962లో జరిగిన తొలిసారి ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ విజయం సాధించింది. 1972లోనూ సీపీఐ గెలిచింది. 1994లో సీపీఎం పార్టీ అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహనరావు గెలుపొందారు. తర్వాత 1999, 2004, 2009 ఎన్నికలలో వరుసగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించడం విశేషం. అయితే మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1985లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.ఎస్.ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ ఒక్కసారే ఈ నియోజకవర్గంలో గెలుపొందడం విశేషం.

కేవలం 12 ఓట్లు తేడాతోనే….

ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మధ్య పోరు హోరా హోరీగా సాగింది. వైసీపీ తరుపున ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ తరుపున గంజి చిరంజీవి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి 88,977 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి చిరంజీవికి 88,965 ఓట్లు వచ్చాయి. అంటే వీరిద్దరి మధ్య కేవలం 12 ఓట్లు మాత్రమే. అయితే ఆళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో సొంతంగా ఐదు రూపాయలకే భోజనం క్యాంటిన్లు ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత…..

అంతేకాదు ఆళ్ల రామకృష్ణారెడ్డి భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలిచారు. వారి సమస్యలపై కోర్టులను ఆశ్రయించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని వేల సంఖ్యలో భూములు ల్యాంగ్ పూలింగ్ కింద రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంది. అయితే కొందరు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. వీరికి అండగా నిలిచిన ఆళ్ల…హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారు. అంతేకాదు చంద్రబాబు ఓటుకునోటు కేసు, రాజధాని భూములు వంటి అనేక అంశాలపై కోర్టును ఆశ్రయిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతూ ఆళ్ల వార్తల్లో నిలిచారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పట్టును మరింత పెంచుకోగలిగారు. ఈ పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర తమకు మరింత ఉపయోగపడుతుందని ఆళ్ల అనుచరులు చెబుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 41286 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*