
వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో కొద్ది రోజులుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ 155వ రోజు పాదయాత్రకు ఓ ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం 155వ రోజు జగన్ యాత్ర ఆంధ్ర చరిత్రను తిరగరాసిన గుడివాడ నియోజకవర్గంలోకి ఎంటర్ అయింది. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి సోమవారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి అంగలూరు మీదుగా బొమ్మలురు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45 ప్రారంభమౌతుంది. అనంతరం పాదయాత్ర గుడివాడ వరకూ కొనసాగుతుంది. గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్లో జరగనున్న బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సోమవారం రాత్రి జగన్ బస గుడివాడలోనే ఉంటుంది.
టీడీపీ కంచుకోట గతమేనా…
గుడివాడ నియోజకవర్గానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే (పునర్విభజనకు ముందు) అన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 1983, 85 రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గెలిచారు. అయితే ఆయన ఈ రెండు ఎన్నికల్లోనూ హిందూపురం నుంచి కూడా పోటీ చేయడంతో ఆ నియోజకవర్గాన్ని ఉంచుకుని ఇక్కడ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నియోజకవర్గం టీడీపీకి ఎంత కంచుకోట అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నాని విజయం మినహాయిస్తే ఒక్క 1989లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రెండుసార్లు జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఘనవిజయం సాధించింది. దీనిని బట్టి టీడీపీకి గతం ఎంత కంచుకోటో తెలుస్తోంది.
నాని కోటగా మారిన టీడీపీ కంచుకోట….
ఒకప్పుడు గుడివాడ పేరు చెపితే టీడీపీ, ఎన్టీఆర్ పేరు వినిపించాయి. అయితే ఇప్పుడు కొడాలి నాని పేరు ఇక్కడ నానుతోంది. 2004 నుంచి నాని గుడివాడను తన అడ్డాగా మార్చుకుని పార్టీలతో సంబంధం లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2004లో జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో చంద్రబాబు నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కాదని నానికి టిక్కెట్ ఇచ్చారు. నాడు ఎన్టీఆర్ నాని కోసం గుడివాడలో ప్రచారం చేసి మరీ ఆయన్ను గెలిపించారు. 2004లో జిల్లాలో టీడీపీ వైఎస్ గాలిలో కొట్టుకుపోతే గెలిచిన రెండు సీట్లలో గుడివాడ ఒకటి. నాని నాడు 7 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009లో ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు పోటీలో అయితే నాని ఏకంగా 17 వేల ఓట్ల మెజార్టీతో జిల్లాలోనే తిరుగులేని మెజార్టీతో రెండోసారి గెలిచారు.
2014లో వైసీపీ నుంచి హ్యాట్రిక్ విజయం…
నాని దశాబ్దంన్నర కాలంలో గుడివాడను తన అడ్డాగా మార్చేసుకున్నాడు. తొలి రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన నాని గత ఎన్నికలకు ముందు చంద్రబాబుతో తీవ్రంగా విబేధించి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి వీచినా గుడివాడలో 11 వేల మెజార్టీతో నాని గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. నాని నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లోనూ వైసీపీదే విజయం. దీనిని బట్టి ఇప్పుడు గుడివాడ నాని అడ్డాయే.
నానిని ఢీకొట్టే ధీటైన లీడర్ టీడీపీలో లేడా…
ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన గతంలో ఓ సారి గెలిచాడు కూడా. రావికి ఇక్కడ నానిని ఢీకొట్టే సీన్ లేదంటున్నారు. ఇక ఆఫ్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఆయన కూడా 2009లో నాని చేతిలో ఓడారు. అప్పుడు ముక్కోణపు పోటీలో పిన్నమనేని, రావి ఇద్దరిని నాని ఓడించారు. ఇక వీరిద్దరు కాకుండా వైసీపీలో గెలిచి నానికి రైట్ హ్యాండ్‌గా ఉంటూ టీడీపీలో చేరిన మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్నారు. యలవర్తి స్ట్రాంగ్ క్యాండెట్టే అంటున్నారు. వీరితో పాటు పిన్నమనేని బంధువు అయిన గుడివాడ అర్బన్ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని పూర్ణ వీరయ్య కూడా టిక్కెట్ రేసులో ఉన్నాననిపించుకుంటున్నారు.
లోకేష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా….
అయితే గుడివాడ టీడీపీ వర్గాలతో పాటు ప్రజల్లో ఉన్న టాక్ ప్రకారం రావికి టిక్కెట్ ఇస్తే పిన్నమనేని, యలవర్తి కలిసి ఆయన్ను ఓడిస్తారంటున్నారు. అదే యలవర్తికి సీటు ఇస్తే రావి సపోర్ట్ చేసే పరిస్థితి లేదట. దీనిని బట్టి గుడివాడ టీడీపీలో మూడు ముక్కలాట, నాలుగు స్తంభాలాట అన్న చందంగా మారింది. లోకేష్ ఇక్కడ పార్టీ పటిష్టత కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. మరి ఎన్నికల నాటికి సమీకరణలు ఏమైనా మారితే తప్పా గుడివాడలో మళ్లీ జగన్ జెండాయే ఎగురుతుందా ? అన్న వాతావరణమే అక్కడ కనిపిస్తోంది
Leave a Reply