
వైసీపీ అధినేత జగన్ చాలా రోజుల తర్వాత తన విశ్వరూపం చూపించాడని అంటున్నారు నెటిజన్లు. తాజాగా ఆయన గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నిర్విఘ్నంగా సాగుతున్న ఈ పాదయాత్రలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ ఆయనకు నిరాజనాలు పలుకుతున్నారు. జగన్ కూడా ప్రజలకు అడుగడుగునా నమస్కారాలు చేసుకుంటూ.. వారి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన గుంటూరు జిల్లా లోని అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇంకా పర్యటన కొనసాగుతూనే ఉంది.
వైఎస్ హయాంలో…..
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. జగన్ మాట్లాడుతూ.. దివంగత వైఎస్ఆర్కు గుంటూరు జిల్లా అంటే ప్రాణమన్నారు. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45 టీఎంసీలు. కాగా, నీటిని నిల్వ చేసుకునేందుకు చంద్రబాబు నాలుగేళ్లు సమయం తీసుకుని రైతులను ఇక్కట్లకు గురిచేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ ఒకేసారి 14 లిఫ్ట్‌లు జారీ చేశారు. వాటి ద్వారా 39 వేల ఎకరాలకు ఆ లిప్ట్‌ల ద్వారా స్థిరీకరణ చేశారు. కానీ చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో ఒక్క లిఫ్ట్ కూడా తీసుకురాలేదని వైఎస్ జగన్ విమర్శించారు.ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఎమ్మెల్యే అంటే అర్థం ఇదా….
ఈ మధ్య కాలంలో ఎం.ఎల్.ఏ అనే సినిమా రిలీజ్ అయింది. మంచి లక్షణాలున్న అబ్బాయి అన్నది మూవీ ట్యాగ్‌లైన్. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యే అంటే మాత్రం ‘మామూళ్లు లంచాలు తీసుకునే అబ్బాయి’ అన్నట్లుగా పరిస్థితి తయారైందన్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఇసుక తవ్వేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత వాటా అని ఉంది, చినబాబుకు ఇంత వాటా అని ఉంది. ఎక్కడైనా అవినీతి చేసేవాళ్లు భయపడతారు అని జగన్ చెప్పారు. కానీ ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే.. సీఎంకు ఇంతవాటా, ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబుకు ఇంత వాటా అన్నరీతిన అవినీతి జరుగుతోంది. ఇసుక ఎలా తవ్వుతున్నారంటే.. లిఫ్ట్‌లకు నీళ్లు కూడా అందని పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు.
స్థానిక అవినీతిని ఎండగడుతూ….
22 మంది ప్రాణాలు కోల్పోయేలా తవ్వేశారు. ఈ ప్రభుత్వం నదులు, ఇసుక, ఇలా దేన్నీ వదిలిపెట్టలేదు. చివరికి దేవుడి భూములను కూడా టీడీపీ సర్కార్ వదిలిపెట్టడం లేదు. నియోజక వర్గానికి చెందిన సదావర్తి సత్రం భూములు 84 ఎకరాలుండగా.. స్థానిక ఎమ్మెల్యే కోటి రూపాయల విలువ చేసే ఎకరాను.. కేవలం రూ.10 లక్షల ధరకే అప్పనంగా కొట్టేయాలని చూడగా వైఎస్ఆర్ సీపీ అడ్డుకుంది. న్యాయపోరాటం చేసి భూములకు అసలు విలువ దక్కేలా చేసింది. అంటూ.. అధికార పార్టీ నేతల ఆగడాలపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ విచిత్రమేమంటే.. జగన్ సభకు హాజరైన ప్రతి ఒక్కరూ ప్రతి మాటనూ అత్యంత ఆసక్తిగా వింటూ తమను తాము మరిచిపోయారు. మొత్తానికి ఇన్నాళ్లకు స్థానిక నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని జగన్ బయట పెట్టారని దాదాపు అందరూ జయజయ ధ్వానాలు పలుకుతూ జగన్‌కు మద్దతు ప్రకటించారు.
Leave a Reply