
జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిన నాటి నుంచి పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పెద్దయెత్తున పండగ చేసుకుంటున్నారు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా జనసేన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లోనూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 42 పార్లమెంటు స్థానాల్లోనూ ఒకే గుర్తుపై జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశముంది. ఈ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు జనసేన ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.
ఉమ్మడి గుర్తుగా…..
నిజానికి పవన్ కల్యాణ్ తనకు పార్టీ గుర్తుగా పిడికిలిని కేటాయించాలని కోరారు. ఏలూరు జరిగిన పోరాట యాత్రలో కూడా ఆయన మన పార్టీ గుర్తు పిడికిలి అంటూ ప్రకటన కూడా చేశారు. దీంతో ఎన్నికల సంఘానికి పవన్ కల్యాణ్ మూడు గుర్తులను చెబుతూ అందులో ఏదో ఒకటి ఉమ్మడి గుర్తుగా కేటాయించాలని కోరారు. ఈ మూడు గుర్తుల్లో పడికిలి, గాజు గ్లాసు, బకెట్ ఉన్నాయి. చివరకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. నిజానికి గాజు గ్లాసు గుర్తును పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు.
క్యాడర్ కు ఆదేశాలు….
ఇప్పటికే పవన్ తన ఎర్రకండువా, టీ గ్లాస్ తో అభిమానులు ఆకట్టుకున్నారు. పలు పర్యటనల్లోనూ, పలు సభల్లోనూ ఎర్ర కండువీ టీ గ్లాసును ఆయన చూపిస్తుంటారు. తనకు టీ గ్లాసు అంటే ఎంతో ఇష్టమని ఆయన అనేక సందర్భాల్లో తెలిపారు. సామాన్యుడికి చేరువుగా ఉన్న వస్తువు గుర్తుగా లభించడంతో సులువగా ప్రజల్లోకి వెళుతుందని జనసైనికులు గట్టిగా నమ్ముతున్నారు. పవన్ వచ్చే జనవరి 1వ తేదీ నుంచి విజయవాడలోనే మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఆ సందర్భంగా ప్రతిచోటా, ప్రతికార్యక్రమంలో గుర్తు కనపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జనసేన నుంచి కిందిస్థాయి కార్యకర్తలకు ఆదేశాలు అందాయి.
త్వరలో భారీగా చేరికలు….
ఇక ఉమ్మడి గుర్తు లభించడంతో చేరికలకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందంటున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ, వైసీపీ నేతలు జనసేనానికి టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు వారందరిని పార్టీలోకి తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. సంక్రాంతి పండగ తర్వాత జనసేనలోకి భారీగా చేరికలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని చెబుతున్నారు. చేరికలతో జనసేన కళకళలాడిపోతుందని, పవన్ కింగ్ మేకర్ అవ్వడం ఖాయమని జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో గ్లాసు నిండినా…. ఉపయోగముంటుందా? అన్నదే ప్రశ్న. అది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Leave a Reply