
రాజకీయ రాజధానిగా గుర్తింపు పొందిన విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గం ఇటీవల కాలంలో బాగా వార్తల్లోకి ఎక్కింది . ఇక్కడ వంగవీటి రాధా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చారు. ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో బయటకు రావడం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా వాడి వేడి చర్చసాగింది. అయితే, ఇప్పుడు రాధా ఎలాగూ టీడీపీ వైపు మొగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడ మరో పార్టీ జనసేన పోటీ చేయాల్సి వస్తే.. ఏం జరుగుతుంది? ఎవరిని రంగంలోకి దింపుతారు? ఎవరు పోటీ చేస్తారు? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి రాధా కనుక జనసేనలోకి వస్తే.. ఈ టికెట్ ఆయనకే రిజర్వ్ చేసేవారు.
రాధా వచ్చి ఉంటే….
అయితే, ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్‌తో పెద్దగా రాధాకు టచ్ లేదని,పైగా పవన్ పార్టీలోకి వెళ్తే..తనను కేవలం ఒక కులానికి కట్టిపడేస్తారని, మున్ముందు ఇది మంచి పరిణామం కాదని భావించిన రాధా దూరంగా ఉండి కుదిరితే టీడీపీ తీర్థం పుచ్చుకోవాలనిలేదంటే ఇండిపెండెంట్‌గా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బెజవాడ సెంట్రల్ టికెట్‌ను జనసేన ఎవరికి ఇవ్వనుంది? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇక, జనసేన విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే పోటీకి దిగుతామని పేర్కొంటోంది. ఇప్పటికే ఒక దఫా కమ్యూనిస్టు పార్టీలతో విశాఖలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిపింది. వచ్చే ఫిబ్రవరిలో ఫైనల్‌గా మరోసారి టికెట్ల పై చర్చించనున్నారు.
సీపీఎం కు ఇస్తారా?
ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. సీపీఐ, సీపీఎంలు చెరో మూడు సీట్లు కోరాలని నిర్ణయించాయి. అదేసమ యంలో తమకు పట్టు ఎక్కువగా ఉన్న విజయవాడ వెస్ట్‌ను సీపీఐ, సెంట్రల్‌ను సీపీఎం కోరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. విజయవాడ వెస్ట్‌లో గతంలో సీపీఐ నాయకులు రెండుసార్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే, సెంట్రల్లో మాత్రం సీపీఎం తరఫున గతంలో రెండు సార్లు పోటీచేసిన చిగురుపాటి బాబూరావు మాత్రం ఓటమిపాల య్యారు. సీపీఎంలో కీలకనాయకుడిగా ఉన్న ఆయన.. గతంలో కార్పొరేటర్‌గా రెండు సార్లు గెలుపొందారు. అయితే, గడిచి న రెండుసార్లుగా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీచేస్తున్నా.. పరాజయం పాలవుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బాబూరావు కోసమైనా.. ఇక్కడ సెంట్రల్ టికెట్‌ను సీపీఎం కోరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ జనసేన కు ఎలాగూ అభ్యర్థి కొరవడుతున్నారు కాబట్టిబాబూరావుకు కేటాయించే ఛాన్స్ ఉందని సమచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply