
అధికారపార్టీకి ఇక వలసలు మొదలు కాబోతున్నాయి. సంక్రాంతి పండగ అయ్యాక మంచి రోజులు రానుండటంతో వరుసపెట్టి చేరికలు మొదలు అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ తో వైసిపి ఎమ్యెల్యేలను లాక్కున్న టిడిపి ఆ తరువాత నెమ్మదించింది. అధికారపార్టీలోకి కాకుండా విపక్ష పార్టీ వైసిపిలోకి భారీ ఎత్తున వలసలు సాగడం మొదలు అయ్యాయి. ఈ ధోరణి అధికారపార్టీని ఆందోళనకు గురిచేసింది. ఇక జనసేనకు అడపా దడపా నేతలు పోతున్నారు. అధికారపార్టీ, విపక్ష పార్టీల్లో బెర్త్ లు లభించిన వారాంతా జనసేన వైపు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అధికారపార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపనుంది.
ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టి …
టిడిపి ఆకర్ష్ ను ఈసారి ఉత్తరాంధ్ర నుంచి సెంటిమెంట్ గా ప్రారంభిస్తుందని ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ నేత తో పాటు మాజి ఎంపిలు సబ్బం హరి, కొణతాల రామకృష్ణ టిడిపి తీర్ధం స్వీకరిస్తారని అంటున్నారు. దాడి వీరభద్రరావు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. అలాగే గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ కి చెందిన కొందరు సీనియర్ నేతలతో పార్టీ వర్గాలు ఇప్పటికే మంతనాలు సాగిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ లోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అవసరాన్ని బట్టి చేరికలు వుంటాయని తమ్ముళ్ళు అంటున్నారు.
పొత్తు వున్నా సైకిల్ ఎక్కేందుకే …
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి కలిసి పోటీ చేసే అంశం దాదాపు ఖరారు అయ్యింది. జాతీయ రాజకీయాల్లో టిడిపి చక్రం తిప్పాలని భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తో కలిసి చెట్టా పట్టాల్ వేసుకుని ఇప్పటికే బాబు సైకిల్ తొక్కుతున్నారు. ఈనేపధ్యంలో కాంగ్రెస్ లో ఉన్నా పొత్తులో భాగంగా వారికి ఇచ్చే సీట్లు బాబు కేటాయిస్తారు. కానీ హస్తం కన్నా సైకిల్ సేఫ్ అని కాంగ్రెస్ నేతలు లెక్కిస్తూ ఉండటంతో వారు పసుపు కండువా కప్పుకునేందుకు ఉత్సహం చూపిస్తున్నట్లు టిడిపి వర్గాలు వస్తున్న సమాచారం. అవసరానికి మించి నేతలు వున్న నియోజకవర్గాలు కాకుండా ఆ నేతలు వస్తే గెలుపులో కీలక పాత్ర ఉంటుందని లెక్కేసినవారికే పార్టీలోకి స్వాగతించాలి అని అధిష్టానం యోచన గా తెలియవస్తుంది
Leave a Reply