
తెలుగు రాష్ట్రాలు రెండు ముక్కలుగా ఏర్పడ్డాక, కొత్త ప్రభుత్వాలు కొలువైయ్యాక టిడిపికి ఒక చీకటి రోజు ఎదురైంది. అదే ఓటుకు నోటు కేసు. రాజకీయ చాణుక్యుడిగా నాలుగు దశాబ్దాలు చక్రం తిప్పిన చంద్రబాబు కు చేదు గుళికను కెసిఆర్ మింగించిన రోజు. మొత్తానికి ఆ కేసు ఏదో అంతర్గతంగా ఒక పెద్దాయన్ని పెట్టి రాజీ చేసుకుని బాబు అమరావతి వచ్చేశారు. కెసిఆర్, బాబు రాజీ తో కేసు అటకెక్కిందనే అంతా భావించారు. కానీ ఎప్పుడు ఏ కేసు ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన కెసిఆర్ ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ఓటుకు నోటు కేసును బ్రహ్మాస్త్రంగా టిడిపి కాంగ్రెస్ కూటమిపై ఎక్కుపెట్టారు.
అది తప్ప అన్ని మాట్లాడుతున్న నేతలు …
కెసిఆర్ ఈ కేసుపై చేస్తున్న వ్యాఖ్యలకు టిడిపి నుంచి సూటీగా సమాధానం రావడం లేదు. గులాబీ బాస్ చేసే విమర్శలు, తిట్లను సైతం సున్నితంగా పక్కన పెట్టి చేసింది చెప్పుకుని ఓట్లు అడగండి ఎందుకు మా నేతను తిడతారంటూ టిడిపి నేతలు సోమిరెడ్డి వంటి వారు వాపోతున్నారు. 2004 లో కాంగ్రెస్ తో 2009 లో టిడిపి తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో కెసిఆర్ చెప్పాలంటూ విమర్శలు తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఓటుకు నోటు కేసు జోలికి అస్సలు పోయేందుకు ఇష్టపడటం లేదు. కెసిఆర్ తిట్ల పురాణం మొదలు పెట్టిన వెంటనే ఒకరిద్దరు ఓటు కు నోటు లో మమల్ని చేసేదేమి లేదని దూకుడుగా వెళ్లడంతో అధిష్టానం వెనక్కి తగ్గమనడంతో ఆ ప్రస్తావన లేని విమర్శలు ఆరోపణలకు తెరతీశారు పసుపు తమ్ముళ్లు.
రోజు రోజుకు తీవ్రత పెరుగుతూ వస్తుంది …
కెసిఆర్ ఇప్పుడు తెలుగుదేశం అధినేతను బండబూతులు తిడుతూ డోస్ పెంచుతున్నారు. అదే ఇప్పుడు తెలుగుదేశాన్ని కలవరపరుస్తోంది. తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో ఎన్నికలు జరిగే తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి ప్రజల్లో పలుచన అయ్యే ప్రమాదంలో పడింది. దాంతో కెసిఆర్ నోటి కి సరైన రీతిలో జవాబు చెప్పే వారికోసం ఇప్పుడు టిడిపి అన్వేషిస్తుంది. కాంగ్రెస్ లో రేవంత్ ధీటుగా కౌంటర్ ఇస్తున్నప్పటికీ అటు టిటిడిపి నుంచి కానీ ఎపి నుంచి కానీ ఆ రేంజ్ లో దూకుడు గా ఎవరు గులాబీ దళపతికి సమాధానం చెప్పలేకపోవడం పసుపుదళంలో గుబులు రేపుతోంది. మరి ఈ ఆందోళనకు చంద్రబాబు ఎప్పుడు తెరదించుతారా అని ఎదురు చూస్తున్నారు తమ్ముళ్ళు.
Leave a Reply