పనిమంతులు వీరండీ…??

k.chandrasekharrao chandrababunaidu narendramodi

ప్రజలను నిరంతరం ప్రచార జంజాటంలో ముంచెత్తడం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటున్నారు పాలకులు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రానిదీ అదే బాట. అసలు పనుల కంటే పబ్లిసిటీ కోసం వెచ్చిస్తున్న ధనమూ, సమయమూ ఎక్కువగా ఉంటోందనే విమర్శలు వినవస్తున్నాయి. ఇది అతిశయోక్తి కావచ్చు. కానీ పూర్తిగా వాస్తవ విరుద్ధమని చెప్పలేం. పోలవరం, కాళేశ్వరం పేరిట సృష్టిస్తున్న రికార్డులు పుస్తకాల్లో ఎక్కించేందుకు పడే తపన చూసినవారు ముక్కుమీద వేళ్లేసుకుంటున్నారు . ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. పోలవరం నిర్మాణంలో గిన్నిస్ రికార్డులు, అమరావతి రాజధాని సందర్శనల వంటి ప్రచార కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. వీటిని ప్రసార, ప్రచురణ మాధ్యమాల్లో హైలైట్ చేసుకోవడానికి వెచ్చిస్తున్న ఖర్చు వృథా ప్రయాసగా ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇటువంటి గిమ్కిక్కుల వల్ల ప్రచార లబ్ధి లభించవచ్చునేమో కానీ దీర్ఘకాలిక ప్రయోజనం శూన్యమనే వాదనలూ ఉన్నాయి. ఏదేమైనా పనిమంతుడిని చెప్పకుండానే ప్రజలు గుర్తిస్తారు. కేవలం గుర్తింపు కోసం చేసే కార్యాలను విమర్శనాత్మక కోణంలోనే చూస్తారు. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం ప్రతిష్ఠ తెచ్చిపెట్టదు.

ఏపీలో హోరు…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా హాలీవుడ్ పిక్చర్ ను తలపింపచేయాలనుకుంటారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రకమైన హడావిడితోనే పదుల సంఖ్యలో ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారు. ధర్మపోరాట దీక్షలు, జ్ణానభేరీల పేరిట రాష్ట్రంలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. మీడియాకు పెద్ద ఎత్తున వాణిజ్యప్రకటనలు జారీ చేస్తున్నారు. అందుకుగాను భారీగానే ఖర్చవుతోంది. కేంద్రప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనే విషయాన్ని మూలమూలలా ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో దీక్షలను తలపెడుతున్నారు. నిజానికి ఇప్పుడున్న ఆధునికవ్యవస్థలో అంతగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే చెప్పాల్సిన విషయం ప్రజలకు చేరిపోతుంది. అయితే నిరంతరం ఆ వేడిని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ప్రతిజిల్లాలోనూ టీడీపీ వీటిని తలపెడుతోంది. ఏపీ ప్రస్తుత దుస్థితికి కేంద్రాన్ని,బీజేపీని బాధ్యులుగా చూపించాలనే యత్నమిది. నిజానికి రాజధానిలో ఇప్పుడిప్పుడే పనులు పుంజుకున్నాయి. ఇంకా కొలిక్కి వచ్చేందుకు చాలాకాలం పడుతుంది. ఈలోపుగానే ఎన్నికలు వస్తున్నాయి. దాంతో రాజధాని యాత్రల పేరిట ప్రజలను అమరావతికి రప్పిస్తున్నారు. అక్కడక్కడ సాగుతున్న పనులు , గ్రాఫిక్ డిజైన్లు చూపించి పంపుతున్నారు. రకరకాల కారణాలతో పోలవరంలో అప్పుడప్పుడు పనులు ఆగిపోతున్నాయి. మందకొడిగానూ సాగుతున్నాయి. నిజానికి రాష్ట్రప్రభుత్వం తొలుత నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం చూస్తే ఈపాటికి ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండాలి. కానీ ఒక్కరోజు రికార్డులతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యి నీళ్లు అందితేనే ప్రజలకు మేలు. రికార్డులతో వారికి ఒరిగేదేమీ ఉండదు.

తెలంగాణలోనూ అదే జోరు…

తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రచారయావలో ఏపీతో పోటీ పడుతోంది. ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాములుగా భావించిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇంకా పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాలేదు. ప్రతిఇంటికీ నీళ్లు ఇస్తే తప్ప ఎన్నికల్లో ఓట్లు అడగనని శపథం చేసిన ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీ తెచ్చుకున్నారు. స్కీములకు, ప్రజాభిప్రాయానికి సంబంధం లేదు. ఓట్లు రావడానికి వ్యక్తిగత సంక్షేమపథకాలే దోహదం చేస్తాయని నిర్ద్వంద్వంగా కేసీఆర్ నిరూపించారు. అయినప్పటికీ తెలంగాణ అన్నిట్లోనూ అగ్రగామిగా నిలుస్తోందని, దేశానికి ఆదర్శమనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. రైతుబంధు పథకం, రైతులకు ఇన్సూరెన్సు స్కీములను ఇందుకు ఉదాహరణలుగా చూపుతున్నారు. దేశంలోని అన్ని భాషల్లోనూ ప్రకటనలు సైతం ఇస్తున్నారు. కాళేశ్వరం పనుల్లో రికార్డులూ నమోదు చేస్తున్నారు. నిజానికి కేసీఆర్ కు ఒక వెసులుబాటు ఉంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోగల పార్టీ ప్రస్తుతానికి తెలంగాణలో లేదు. అయినప్పటికీ తన జాతీయ పాత్రకు అనువైన ప్రాతిపదిక నిర్మించుకోవడానికి ప్రచార కార్యక్రమాలను ఆలంబనగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అప్పుల్లోనూ రికార్డులు తిరగరాస్తున్నాయి. రెండు రాష్ట్రాల అప్పుల ఖాతా రెండు లక్షల కోట్లకు అటు ఇటుగా చేరిపోయింది. ఈ రుణ భారం మరో 20 సంవత్సరాల పాటు వెన్నాడనుంది. అంటే మరో తరానికి సరిపడా అప్పులు చేసేశారన్నమాట.

ముందువరసలో కేంద్రం…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముగ్గురూ ముగ్గురే. ప్రచారంలోనూ, పనిలోనూ వారి ప్రత్యేకతలే వేరు. నిత్యం ప్రజల నోళ్లలో నానుతూ , కార్యక్రమాల్లో మునిగితేలుతూ అన్నింటికీ తామే ఆద్యులమన్న భావన కల్పిస్తుంటారు మోడీ, చంద్రబాబు. పెద్దగా కనిపించకుండా తెరముందుకు వచ్చినప్పుడు సంచలనాలు సృష్టిస్తూ అంతా తనచుట్టూనే తిరుగుతుందన్న బలమైన ముద్ర వేస్తుంటారు కేసీఆర్. వీరు ఏం చేసినా ప్రచారం గుమ్మెత్తిపోతుంది. దేశంలో జీవనప్రమాణాలు, ఉపాధి అవకాశాల మెరుగుదల అంతంతమాత్రంగానే ఉంది. కానీ ప్రధాని గణాంకాలు చూస్తే ఎవరైనా ఇంతటి ప్రగతి సాధించామా? అని ఆశ్చర్యపోవాలి. పేదలకు ఉద్దేశించిన జనధన్ బ్యాంకు అకౌంట్లు 33 కోట్లు కొత్తగా ఏర్పాటు చేశామంటారు. అందులో 68 వేల కోట్ల రూపాయల మేరకు విలువైన నిధులు నిల్వ అయ్యాయి. పేదల బతుకులు బాగుపడిపోయాయనే కోణంలో విశ్లేషిస్తారు. 11 కోట్లమందికి ముద్ర రుణాలు ఇచ్చాం. వారందరికి ఉపాధి దొరికిందంటారు. అయిదుకోట్లమందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేశామంటారు. అసలు ఈ గణాంకాలు చూసినవారికి మరో పదేళ్ల వరకూ బీజేపీ అధికారానికి ఢోకాలేదనేంత భరోసా ఏర్పడుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ల విషయానికొస్తే రెండు లక్షల కోట్లు, లక్షా యాభై వేల కోట్లు నాలుగేళ్లలో ఇచ్చామంటారు. కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోందనే భావన కల్పిస్తారు. నిజానికి చట్టబద్ధంగా రాజ్యాంగ సంస్థలు మంజూరు చేసే పన్నుల వాటా ఆ మొత్తం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వచ్చి తీరాల్సిందే. దానికి ప్రధానిమోడీ, బీజేపీ దయాదాక్షిణ్యాలతో సంబంధం లేదు. అయినప్పటికీ కేంద్రం ఖాతాలో వేసుకోవడానికి గరిష్ఠంగా ప్రయత్నిస్తారు. మొత్తమ్మీద ప్రచారంలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఈవిషయంలో ముగ్గురూ విజేతలే… 2019లో ప్రజాతీర్పును గెలుచుకుంటారో లేదో వేచి చూడాలి.

 

 

– ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 30975 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*