ఆ నలుగురి నిర్లక్ష్యమేనటగా….!!!

k-chandrasekharrao-ministers

ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసినా ఇప్పుడు పార్టీ చతికల పడటానికి కారణాలను ఆయన విశ్లేషిస్తున్నారు. పదహారు పార్లమెంటు స్థానాలు వస్తాయనుకుంటే కేవలం తొమ్మిది స్థానాలు రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తనయుడు కేటీఆర్ కు పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోవడంపై ఆయన అన్ని రకాలుగా ఆరా తీస్తున్నారు.

మంత్రులకు బాధ్యతలను అప్పగించినా….

ఇందులో ప్రధానంగా నలుగురు మంత్రుల నిర్లక్ష్యమే నాలుగు స్థానాలు కోల్పోవడానికి ప్రధాన కారణంగా తేల్చినట్లు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలిగి మరీ తన కుమారుడు సాయికిరణ్ ను బరిలోకి దింపారు. కానీ అక్కడ ఓటమి ఎదురయింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ లో కూడా టీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడాన్ని కేసీఆర్ తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది.

వారు ప్రాతినిధ్యం వహిసున్న నియోజకవర్గాల్లో….

ఇక మల్కాజిగిరి స్థానాన్ని కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఏరికోరి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. ఇక్కడ గెలుస్తామని ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తమకు పోటీయే కాదని భావించారు. కానీ ఇక్కడ కూడా మంత్రిగారి అల్లుడు ఓటమి పాలయ్యారు. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ కు మెజారిటీ రాలేదు. ఇక ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కూడా ఓటమి పాలయ్యారు. ఇక్కడ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే నిర్మల్ లో టీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఉండటం గులాబీ బాస్ కు మింగుడుపడటం లేదు.

కవిత విషయంలోనూ…..

నిజామాబాద్ పార్లమెంటుకు పోటీచేసిన కేసీఆర్ తనయ కవిత ఓటమిపై గల కారణాలను కూడా లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలసి పోవడం వల్లనే కవిత ఓటమి పాలయ్యారని చెబుతున్నా… అక్కడ మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో మెజారిటీ రాకపోవడాన్ని వేలెత్తి చూపుతున్నారు. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా గెలుపు సాధ్యం కాలేదు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండలోనూ వెనకబడి పోవడంతోనే ఓటమి పాలయ్యామని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో మార్పులు ఉంటాయన్న టాక్ ఉండటంతో పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతిభ చూపలేని మంత్రుల్లో టెన్షన్ మొదలయింది.

Ravi Batchali
About Ravi Batchali 25610 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*