
తెలంగాణాలో జనసేన, సిపిఎం జట్టు కట్టి ఎన్నికల్లో దిగితే గులాబీ పార్టీ కి పంట పండినట్లేనా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక పక్క మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ కేసీఆర్ పై యుద్ధం కు మూకుమ్ముడిగా చేయాలని దాదాపుగా నిర్ణయించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ లో చీలిక రాకుండా కాంగ్రెస్ ఒక అడుగు వెనక్కు తగ్గి మరి పొత్తులకు సిద్ధమైంది. అయితే విపక్షాల్లో చీలిక జనసేన, కామ్రేడ్ ల రూపంలో కారు పార్టీ కి వరంగా మారనుంది.
పికె కి యువతలో పట్టు …
యువతలో మంచి క్రేజ్ ఎనిమిది లక్షల సభ్యత్వాలు కలిగి వుంది పవన్ పార్టీ. వరంగల్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో బలంగా క్యాడర్ వుంది సిపిఎం కి. మహాకూటమితో జట్టు కట్టకుండా వీరిద్దరూ బరిలోకి దిగితే 30 స్థానాల్లో విపక్షం ఆశలపై నీళ్ళు చల్లే అవకాశాలు ఉన్నాయని లెక్కేస్తున్నారు విశ్లేషకులు. కెసిఆర్ కోరుకున్నది ఇలాంటి పరిణామమే. జనసేన సిపిఎం అనుకోకుండా అదే పని చేస్తూ గులాబీ శిబిరంలో హుషారు పెంచుతున్నారు. విపక్షాల అనైక్యతే ఆయుధంగా చేసుకుని కారు దూసుకుపోవాలని మొదటినుంచి ఎత్తులు వేస్తుంది.
కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందా?
ఇది గమనించిన కాంగ్రెస్ ఓట్ల చీలికలు జరక్కుండా అన్ని పక్షాలను కలుపుకుని వెళ్ళెందుకు వ్యూహం రచించింది. అయినా కానీ జనసేన, సిపిఎం ల రూపాల్లో మహాకూటమి కోట కట్టకుండానే బీటలు వారేలా చేసింది. తొలినుంచి సీపీఎం కాంగ్రెస్ తో జట్టుకట్టడానికి వ్యతిరేకిస్తూనే ఉంది. జాతీయ స్థాయి నేతలు ఇన్ వాల్వ్ అయినా రాష్ట్ర నేతలు కాంగ్రెస్ తో పొత్తుకు ససేమిరా అంటున్నారు. టీడీపీతో ఉన్న కూటమిలో సహజంగానే జనసేన చేరడానికి ఇష్టపడదు. దీంతో గులాబీకి వ్యతిరేకంగా రూపుదాలుస్తున్న మరో కూటమిని ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Leave a Reply