
కేసీఆర్ నిర్ణయాలు భలేగా ఉంటాయి. ఆ అనూహ్య నిర్ణయాల వెనుక ఆంతర్యమెమిటో ఎవ్వరికీ అంత సులువుగా అంతబట్టదు. అవి ఎప్పుడు.. ఎలాంటి ప్రభావం చూపుతాయో.. ఎవరికి మోదంగా.. ఎవరికి ఖేదంగా మారుతాయో కూడా తెలియదు. జరిగినప్పుడు చూడాలంతే. ఒక్కరోజులోనే తెలంగాణ అసెంబ్లీ రద్దు.. అభ్యర్థుల ప్రకటన చేసి, రాజకీయాల్లో పెను సంచలనం రేపిన కేసీఆర్.. పలువురు నాయకుల పట్ల కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుని సొంత పార్టీలోనే కుంపటి రాజేశారు. ఇది అంతిమంగా ఎటువైపు దారితీస్తుందో తెలియదుగానీ… నివురుగప్పిన నిప్పులా ఉందనే టాక్ పార్టీవర్గాల్లోనే వినిపిస్తోంది. అయితే.. ఇక్కడ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దారెటు అన్నదానిపై కూడా పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
కడియం ప్రయత్నించినా……
నిజానికి.. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరులేదు. వచ్చే ఎన్నికల్లో తనతోపాటు తనకూతురు కూడా టికెట్ తెచ్చుకోవడానికి కడియం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో తన వర్గాన్ని పెంచి పోషించుకున్నారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్‌ను సిట్టింగ్ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా తయారు చేసేందుకు కడియం అన్ని ప్రయత్నాలు చేశారనే టాక్ కూడా ఉంది. ఇక రాజయ్యకు టికెట్ రాదనీ.. తమకే గ్యారంటీ అంటూ అంతర్గంగా ప్రచారం చేసుకున్న కడియంకు కేసీఆర్ అనూహ్యంగా షాక్ ఇచ్చారు.
కావ్య ఏడాదిన్నరగా…..
గత యేడాదిన్నర కాలంగా నియోజకవర్గంలో కడియంతో పాటు ఆయన కుమార్తె డాక్టర్ కడియం కావ్య పేరుతో జరిగిన హంగామా ? అంతా ఇంతా కాదు. అయితే కేసీఆర్ కడియంతో పాటు ఆయన కూతురు కూడా టికెట్ ప్రకటించలేదు. దీంతో షాక్ తిన్న కడియం తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కడియంకు టికెట్ ఇవ్వకపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయని పలువురు నాయకులు అంటున్నారు. కడియం పనితీరుపై కేసీఆర్ సంతృప్తిగా లేరనీ.. విద్యాశాఖను గాడిలో పెట్టడంలో ఆయన విఫలం అయ్యారనీ.. ఆయన వల్లే ఈరోజు ఉద్యోగవర్గం ప్రభుత్వంపై గుర్రుగా ఉందనే విషయం కేసీఆర్ దాకా వెళ్లినట్లు తెలిసింది.
ఎంపీగా పంపాలనేనా?
ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వనట్లు సమాచారం. అవసరమైతే.. వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పంపిచాలే తప్ప ఇక్కడ మాత్రం కడియంను ఉంచొద్దనే ఆలోచనకు కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్యర్యం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ సమక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ లిస్టులో చాలా మంది ప్రముఖల పేర్లు వినిపిస్తుండగా… కడియం పేరు కూడా కలిసింది.
Leave a Reply