
మధ్యప్రదేశ్ లో మళ్లీ మ్యాజిక్ జరుగుతుందా? ఈసారి కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతాయా? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. మధ్యప్రదేశ్ దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోట. పదిహేనేళ్ల తర్వాత దానిని బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో సయితం పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం పడకపోవడం బీజేపీ పట్ల ఆ రాష్ట్రంలో ఎంత సానుకూలత ఉందీ అర్థమవుతుంది. అలాంటి మధ్యప్రదేశ్ లోమళ్లీ కమలం వికసిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
బీజేపీ బలంగా…..
మధ్యప్రదేశ్ లో మొత్తం29 పార్లమెంటు స్థానాలున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీజేపీకి 27 సీట్లు దక్కాయి. రెండు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ప్రాంతీయ పార్టీలకు చోటు లేని రాష్ట్రం కావడంతో ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ల మధ్యనే హోరాహోరీ పోరు సాగనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు రెండు స్థానాల దూరంలో కాంగ్రెస్ పార్టీ నిలిచినా ఆ పార్టీయే అధికారంలోకి వచ్చింది. 114 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ముఖ్యమంత్రి పీఠం కాంగ్రెస్ కే దక్కింది. విచిత్రమేమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కన్నా, బీజేపీకి వచ్చిన ఓట్లే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీకి 40.9 శాతం ఓట్లు వస్తే బీజేపీకి 41 శాతం ఓట్లు వచ్చాయి.
అందుకే కమల్ నాధ్ కు…..
నిజానికి ఇక్కడ జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి కావాల్సి ఉంది. రాహుల్ కు అత్యంత సన్నిహితుడైన సింధియాను పక్కన పెట్టి సీనియర్ నేత కమల్ నాధ్ కు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కమలనాధ్ ఎంపిక జరిగిందన్నది కాదనలేని వాస్తవం. కమల్ నాధ్ కు ఇవ్వకుండా సింధియాకు ఇస్తే గ్రూపుల గోల పెరిగి లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతింటామని భావించి కమల్ నాధ్ కే రాహుల్ గాంధీ చివరకు జై కొట్టాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి అత్యధిక స్థానాలను తెచ్చిపెట్టాల్సిన బాధ్యతను కమల్ నాధ్ పై ఉంచారు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ లాంటి సీనియర్ల సహకారంతో ఆయన లోక్ సభ ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు.
చౌహాన్ ను ఢీకొట్టాలంటే…..
మరోవైపు చరిష్మా గల శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. ఆయనను ఢీకొట్టడం మాటలు కాదు. కమల్ నాధ్ పాలన వందరోజులు పూర్తి చేసుకున్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ చౌహాన్ ఇప్పటికే ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం కాంగ్రెస్ కు ఇబ్బందికరమే. కమలం పార్టీకి పట్టున్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో నెగ్గుకు రావడం కమల్ నాధ్ కు కష్టమే. గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీని రెండంకెలకు తీసుకెళ్లాలన్నది కమల్ నాధ్ యోచన. అలాంటి ఫలితాలు వస్తేనే కమల్ నాధ్ కు ఇంటా, బయటా గౌరవం దక్కుతుందన్నది పార్టీ నుంచి విన్పిస్తున్న టాక్. బీజేపీ గత ఎన్నికల ఫిగర్ కు చేరితే మాత్రం కమల్ నాధ్ కు పదవీ గండం తప్పదంటున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 లోక్ సభ స్థానాలు దక్కాయి. ఆ ఫిగర్ వస్తే చాలు కమల్ నాధ్ బయటపడినట్లే.
Leave a Reply