తొలిసారి…కనిమొళి…..??

kanimoli-dmk-thothukudi-constiuency

కనిమొళి…. పరిచయం అక్కరలేని పేరు. జాతీయ , తమిళ రాజకీయాల్లో ఈ యువ రాజకీయ వేత్త పేరు అందరికీ సుపరిచితం. 2జీ కేసులో నిందితురాలిగా జైలు శిక్ష అనుభవించిన కనిమొళి చిన్న వయసులోనే రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి గారాలపట్టి అయిన కనిమొళి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో తలపడుతున్నారు. తుత్తుకుడి (ట్యుటుకోరిన్) నియోజకవర్గం నుంచి లోక్ సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలైన ఆమె తండ్రి, సోదరులు స్టాలిన్, ఆళగిరి లాగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికయ్యేందకు తాపత్రయపడుతున్నారు. కనిమొళి కేవలం రాజకీయ నాయకురాలే కాదు. మంచి కవి. సాహితీవేత్త. తమిళంపై తిరుగులేని పట్టున్న రచయిత. తండ్రి కరుణానిధి సాహితీ వారసురాలు. తమిళంలో అనేక వ్యాసాలు కవితలు రాశారు. మంచి కవయిత్రి. కరుణానిధి కుటుంబంలో కనిమొళికి మాత్రమే సాహిత్యంపై ఆసక్తి, అభిలాష ఉంది. సోదరులు స్టాలిన్, ఆళగిరిలకు ఈ విషయంపై ఆసక్తి లేదనే చెప్పాలి.

గట్టి పోటీ తప్పదా…..

ప్రస్తుతం కనిమొళి తుత్తుకుడిలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళ సై సౌందర్ రాజన్ ఆమెను ఢీకొంటున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే అయినప్పటికీ కనిమొళికే అవకాశాలు అధికమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. వాస్తవానికి ఈ నియోజకవర్గం డీఏంకేకు పట్టున్న నియోజకవర్గం కాదు. గత ఎన్నికల్లో ఇక్కడ అన్నాడీఎంకే గెలిచింది. మెజారిటీ కూడా లక్షకు పైగానే ఉంది. అన్నాడీఎంకే కు 3.66 లక్షల ఓట్లు రాగా, డీఎంకేకు కేవలం 2.42 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏడీఎంకేకు 1.82 లక్షలు,కాంగ్రెస్ 63 వేలు ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఈసారి ఆ ఓట్లు తమ ఖాతాలో పడతాయని, తద్వారా విజయాన్ని అందిపుచ్చుకోగలమని డీఎంకే శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 14 లక్షల మంది ఓటర్లున్నారు. నియోజకవర్గంలో నాజర్ కులస్థులు అధికం. ఇద్దరు అభ్యర్థులు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఓట్ల చీలిక అనివార్యం కానుంది. వాస్తవానికి ఈ స్థానం అన్నాడీఎంకేది. గత ఎన్నికల్లో ఆ పార్టీయే గెలిచింది. కానీ బీజేపీతో పొత్తు కారణంగా దానిని ఆ పార్టీకి వదిలేసింది. నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో భాగంగా 2009లో తిరుబెందూర్ నియోజకవర్గాన్ని విభజించి తిరునల్వేలి, తుత్తుకుడి నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. దాని పరిధిలో తిరుబెందూర్, ట్యూటికోరిన్, విలాతకులం, కోవిల్ పట్టి, బట్టి పెరదం, వైకుంఠం అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014లో అన్నాడీఎంకే, 2009లో డీఎంకే అభ్యర్థులు ఇక్కడ గెలిచారు.

ఇదే ప్రచారాస్త్రం…..

స్టెరిలైట్ ఫ్యాక్టరీ వివాదం ఈ దఫా ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా ఉంది. ఇది అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే కీలక అంశం. స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా తుత్తుకూడిలో వందరోజుల పాటు ఆందోళన జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13మంది మృతి చెందారు. వందమందికిపైగానే గాయపడ్డారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇది తమకు సానుకూల అంశమని డీఎంకే ప్రచారం చేసుకుంటుంది. తాను గెలిస్తే ఈ సమస్యను చక్క బెడతానని కనిమొళి చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి సౌందర్ రాజన్ సయితం గెలుపుపై ధీమాతో ఉన్నారు. స్టెరిలైట్ కర్మాగారం అంశాన్ని పరిష్కరిస్తానని ఆమె చెబుతున్నారు. చెన్నై నుంచి తుత్తుకూడి మీదుగా తిరువనంతపురానికి బుల్లెట్ ట్రైన్ ను తీసుకొస్తానని ఆమె హామీ ఇచ్చారు. కేంద్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి తాను నియోజకవర్గం సమస్యలను పరిష్కరించగలనని చెబుతున్నారు. గతంలో సౌందర్ రాజన్ రెండుసార్లు అసెంబ్లీకి, ఒకేసారి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సానుభూతి పనిచేస్తుందని కమలనాధులు ఆశిస్తున్నారు. కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ తరుపున పారిశ్రామిక వేత్త టీసీఎస్ పోన్ కుమరన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరుపున డాక్టర్ ఎం. భువనేశ్వరన్ లు బరిలో ఉన్నారు. వాస్తవానికి చతుర్ముఖ పోటీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ డీఎంకే, బీజేపీ మధ్యనే ఉంది. ఎండీఎంకే, కాంగ్రెస్ తనకు మద్దతు ప్రకటించడంతో గెలుపుపై కనిమొళి ధీమాగా ఉన్నారు. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత తనకు కలసి వస్తుందని ఆమె ఆశాభావంతో ఉన్నారు. సౌందర్ రాజన్ అన్నాడీఎంకే మద్దతు, మోదీ వ్యక్తిగత ఇమేజ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా మోదీ క్లీన్ ఇమేజ్ తనకు ఉపకరిస్తుందని ఆమె అంచనా. మొత్తం మీద విజేతను ఇప్పటికే ప్రజలు నిర్ణయించారు. పోలింగ్ ముగియడంతో కనిమొళి విజయం పై ధీమాగా ఉన్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 27672 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*