కరణం…..ఓకే అనడానికి కారణం….!!!

karanam-balaram-telugudesam-party

కరణం బలరాం… ప్రకాశం జిల్లాలో పేరుమోసిన నేత. ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ తరుపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. కరణం బలరాం రాకతోనైనా చీరాలలో ఇరవై ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగురుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కరణం బలరాంకు ఈ నియోజకవర్గంతో పెద్దగా సంబంధాలు లేవు. కరణం బలరాం రాజకీయం మొత్తం అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాలకే పరిమితమయింది. అయితే ఆయన జిల్లా స్థాయి నేత కావడంతో ఏ నియోజకవర్గంలోనైనా తాను గెలిచి తీరతానన్న ధీమాను కరణం అనుచరులు వ్యక్తం చే్స్తున్నారు.

పార్టీ బలం లేకున్నా….

చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా లేదు. గ్రూపు తగాదాలతో దాదాపు రెండుదశాబ్దాలనుంచి చీరాలలో తెలుగుదేశంపార్టీ జెండా ఎగరలేదు. 1999లో చివరిగా చీరాల టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు పాలేటి రామారావు. అదే టీడీపీకి చీరాలలో చివరి విజయం. చీరాల నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ. చేనేతలు ఎక్కువగా ఉన్నారు. వైశ్య సామాజిక వర్గం కూడా బాగానే ఉంది. ఈ లెక్కలన్నీ వేసుకుని కరణం బరిలోకి దిగినట్లు కన్పిస్తోంది. అద్దంకి నియోజకవర్గం ఎటూ తనకు దక్కదని తెలిసిన కరణం బలరాం చీరాల అభ్యర్థిగా అధినేత ఎంపిక చేస్తాననడంతో సరేనన్నారు.

మరోవైపు మాస్ లీడర్….

చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బలమైన నేత. మాస్ లీడర్ గా పేరుంది. కరణం బలరాం లాగానే ఆయనకు కూడా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. 2009 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి తొలి ఎన్నికలోనే విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి నవోదయ పార్టీని సొంతంగా పెట్టుకుని పోటీ చేసి మరీ గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అక్కడ గతఎన్నికలలో పోటీ చేసిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య అంతర్గత పోరు పెరిగి ఆమంచి టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఆమంచి ధీమా అదే…..

ఆమంచి స్థానికుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. పెద్దయెత్తున అనుచరగణంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా తనకు ఉపయోగపడుతుందని ఆమంచి గట్టిగానమ్ముతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆమంచి వైసీపీ గుర్తు మీద గెలవడం పెద్ద కష్టమేదీ కాదంటున్నారు విశ్లేషకులు. అయితే కరణం బలరాం పార్టీలో ఉన్న నేతలందరినీ కలుపుకుని పోతున్నారు. సీనియర్ నేత కావడంతో ఆయనకు సహకరించేందుకు టీడీపీ నేతలు విభేదాలు మరిచి ముందుకు వస్తున్నారు. అయితే కరణం బలరాంకు చీరాలనుంచి గెలవడం అంత సులభం కాదన్నది తెలిసినా… ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉండకూడదనే ఆయన చీరాల టిక్కెట్ ఇచ్చినా వెంటనే ఓకే చెప్పేశారన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్.

Ravi Batchali
About Ravi Batchali 40561 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*