ఆయన చేతుల్లోనే కరణం ఫ్యూచర్‌..!

ప్రకాశం జిల్లాలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కరణం బలరాం ఫ్యామిలీ పొలిటికల్‌ ఫ్యూచర్‌ అదే జిల్లాకు చెందిన ఓ మంత్రి చేతిలో డిసైడై ఉందా ? ఆ మంత్రి తీసుకునే డెసిషన్‌ బట్టి కరణం వారసుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా ? లేదా అన్నది తేలనుందా అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు ఎస్‌ అని చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో అద్దంకి పేరు చెబితే పొలిటికల్‌గా అక్కడ‌ ఎంత హై ఓల్టేజ్‌ వాతావరణం ఉంటుందో చెప్పక్కర్లేదు. దశాబ్దాల రాజకీయ వైరం ఉన్నా కరణం, గొట్టిపాటి ఫ్యామిలీలు టీడీపీలో ఉన్నాయి. గతంలో వీరిద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉండి ప్రత్యర్థులుగా తలపడేవారు. అద్దంకిలో గత రెండు ఎన్నికల్లోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ చేతిలో కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్‌ ఇద్దరూ ఓడిపోయారు.

నిత్యం వివాదాలే….

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ టీడీపీలో చేరినప్పుడు కరణం పెద్ద యుద్ధమే చేశారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడానికి వీల్లేదంటూ నానా హంగామా చేశారు. అయితే చంద్రబాబు పట్టుపట్టడంతో గొట్టిపాటి టీడీపీలో చేరిపోయారు. గొట్టిపాటి టీడీపీలో చేరినప్పటి నుంచి గొట్టిపాటి వర్సెస్‌ కరణం మధ్య‌ నియోజకవర్గంలో నిత్యం వివాదాలు జరుగుతున్నాయి. ఏడాది కాలంగా అద్దంకిలో తెలుగుదేశం పార్టీ గొట్టిపాటి వర్సెస్‌ కరణం వర్గాలుగా చీలిపోయి గొడవలకు దిగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య‌ సయోధ్య కోసం చంద్రబాబు ఎన్నో సార్లు ప్రయత్నాలు చేశారు. జిల్లా పార్టీ నాయకులు, మంత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పంచాయితీలు జరిగినా వీరి వివాదం కొలిక్కి రాలేదు. చివరకు చంద్రబాబు కరణంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని చెప్పినా కూడా కరణం మాత్రం అక్కడ రెచ్చకొట్టుడు ధోరణతోనే వ్యవహరిస్తున్నారు.

అద్దంకి సీటు మాత్రమే….

వచ్చే ఎన్నికల్లో గొట్టిపాటికి సీటు చంద్రబాబు ఖ‌రారు చేశారని కరణం వారసుడి ఫ్యూచర్‌పై ఆయనకు హామీ ఇచ్చారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ నిర్ణయంతో కరణం ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. అద్దంకి సీటు తనదే అని వచ్చే ఎన్నికల్లో తనకు ఎవరు అడ్డు వస్తారో ? ఇక్కడ పోటీ చేసేది తానే అని సవాళ్లు రువ్వుతున్నారు. కరణం ఎన్ని సవాళ్లు రువ్వుకున్నా ఫైన‌ల్‌గా అద్దంకి సీటు గొట్టిపాటి రవికుమార్‌దే అనడంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అద్దంకి పక్కనే ఉన్న దర్శి నుంచి బాబు కేబినెట్‌లో ప్రాధినిత్యం వహిస్తున్న మంత్రి శిద్ధా రాఘవరావు డెషిషనే ఇప్పుడు గొట్టిపాటి ఫ్యామిలీ ఫ్యూచర్‌ను డిసైడ్‌ చెయ్యనుంది.

ఆయనిచ్చే క్లారిటీతోనే…..

వచ్చే ఎన్నికల్లో శిద్ధా రాఘవరావు గుంటూరు జిల్లా నరసారావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే దర్శిలో కోట్లాది రూపాయిలతో అభివృద్ధి చేసిన శిద్ధా మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఆయనకు కేబినెట్‌లో ఛాన్స్‌ ఉండొచ్చు. ఈ టైమ్‌లో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారా ? లేదా జాతీయ రాజకీయాలకు వెళ్లాలనుకుంటే లోక్‌సభకు పోటీ చేస్తారా ? అన్నది క్లారిటీ లేదు. శిద్ధా నరసారావుపేటకు వెళ్తే దర్శిలో కరణంకు లైన్‌ క్లియర్‌ అయినట్టే. అదే శిద్ధా దర్శి నుంచే పోటీ చేస్తే కరణం వారసుడు ఫ్యూచర్‌ మాత్రం గందరగోళంలో పడినట్లే అవుతుంది. మరి అదే జరిగితే కరణం తన వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటాడో ? చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 39141 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*