నెంబర్ గేమ్ లో గెలుపెవరిది…?

కన్నడతెరపై రాజకీయ నాటకం చివరి దశకు చేరుకుంది. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా కర్ణాటక ప్రజలు తెచ్చిన కన్ ఫ్యూజన్ మరికాసేపట్లో తీరనుంది. ఇవాళ బలపరీక్ష నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానమే ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు నంబర్ గేమ్ మొదలైంది. అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికారం చేపట్టే మెజారిటీ లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీకి సుప్రీం తీర్పు ముచ్చమటలు పట్టిస్తోంది. ఎలాగైనా బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఆ పార్టీ శతవిధానాలా ప్రయత్నిస్తోంది. ఇక బీజేపీని ఈ పరీక్షలో ఓడించి అధికారం చేపట్టాలనే దృడనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కూడా గట్టి వ్యూహాలనే పన్నుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే సభలో బీజేపీ అనుసరించనున్న వ్యూహాలను తిప్పికొట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది.

బీజీపీకి గట్టెక్కుతుందా….?

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ ఈ సంఖ్య ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే మ్యాజిక్ ఫిగర్ ను చేరలేదు. అయినా కూడా గవర్నర్ ఆహ్వానం మేరకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ పిలుపు వెనక ఉన్న ఆరోపణలు ప్రస్తుతానికి పక్కన పెడదాం. బలనిరూపణకు ఆయనకు గవర్నర్ 15 రోజులు సమయం ఇచ్చినా, కాంగ్రెస్ సుప్రీం తలుపుతట్టడం, ఇవాళే బలపరీక్ష పెట్టాలని తీర్పునివ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ అన్నిరకాలుగా ప్రయత్నిస్తుంది. ఎన్నికల్లో మొత్తం 222 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవగా, అందులో కుమారస్వామి రెండుచోట్ల విజయం సాధించారు. అంటే మొత్తం 221 మంది ఎమ్మెల్యేలు సభకు వస్తే యడ్యూరప్ప బలపరీక్షలో విజయం సాధించాలంటే 112 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతివ్వాలి. ప్రస్తుతం ఆయన వద్ద 104 మంది మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితిలో ఆయన గట్టెక్కాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలి. ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతివ్వనున్నట్లు తెలిసింది. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ నాయకులంతా సమాలోచనలు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరినీ కాంగ్రెస్, జేడీఎస్ క్యాంపు నుంచి మయం చేశారని తెలిస్తోంది. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ వద్ద రెండే మార్గాలు ఉన్నాయి.

1. ఏడుగురు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమకు మద్దతిచ్చేలా పావులు కదపడం.

2. పదిహేను మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా చూడటం. అలా అయితే సభలో ఎమ్మెల్యేల హాజరు తగ్గి యడ్యూరప్ప 104 మందితోనే బలం నిరూపించుకోవచ్చు.

కాంగ్రెస్, జేడీఎస్ ధీమా…

కాంగ్రెస్ తరుపున 78 మంది, జేడీఎస్ తరుపున 38 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరికి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు ఉంది. వీరిని కాపాడుకునేందుకు హైదరాబాద్ కు క్యాంపునకు తరలించారు. నిన్న రాత్రి అక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకున్నారు. ఈ రెండు పార్టీలలు కూడా తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని, కచ్చితంగా బలనిరూపణలో యడ్డీ ఓటమి ఖాయమనే ధీమాతో ఉన్నాయి. కానీ, బీజేపీ సైతం అంతే ధీమా ప్రదర్శిస్తుండటం, ప్రొటెం స్పీకర్ గా యడ్యూరప్పకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేను నియమించడం వంటివి చూసి లోలోన ఆందోళణ ఉన్న పైకి మాత్రం మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నాయి. ఎక్కడా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఇంతవరకు ఎమ్మెల్యేలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఆ పార్టీలు బలపరీక్షలో చేతులు ఎత్తే వరకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటాయా అన్నది అనుమానమే.

కులం కార్డు తెస్తున్నారా..?

బలపరీక్షలో మద్దతు సాధించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇప్పటికే గాలి జనార్ధనరెడ్డి, శ్రీరాములు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు రంగంలోకి దిగారు. కాగా, డబ్బు, పదవి వంటి ప్రలోభాలతో పాటు కులం కార్డును కూడా తెస్తున్నారని వినిపిస్తోంది. యడ్యూరప్ప లింగాయత్ వర్గానికి చెందిన వారవడంతో ఆ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులకు బీజేపీ గాలం వేసిందని తెలుస్తోంది. ఇక గాలి వర్గానికి చెందిన ఇద్దరికి బీజేపీలో టిక్కెట్లు రాకపోతే కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారని, వారు ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తారనే పుకార్లు కూడా వినపడుతున్నాయి. యడ్యూరప్ప మాత్రం వంద శాతం బలపరీక్షలో నెగ్గుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.  ఏది ఏమైనా ఈ రాజకీయ డ్రామాలకు తెరపడాలన్నా, నెంబర్ గేమ్ లో ఎవరు గెలుస్తారో తేలాలన్నా ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఆగాల్సిందే.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*