కార్తీ…కి ఈసారైనా బెర్త్ దొరికేనా….??

karthi-chidambaram-sivaganga-constiuency

తమిళనాడులోని శివగంగ లో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, అన్నాడీఎంకే అభ్యర్థిగా హెచ్.రాజా బరిలో ఉన్నారు. 1967 లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే ముందుగా చిదంబరం గుర్తుకు వస్తారు. ఏడుసార్లు ఆయన ఇక్కడి నుంచి ఎన్నిక కావడమే ఇందుకు కారణం. ఒక్క 1999లోనే చిదంబరం ఇక్కడి నుంచి ఓటమిపాలయ్యారు. అయిదు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. 1999లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసిన చిదంబరాన్ని కాంగ్రెస్ అభ్యర్థి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ ఓడించారు. దాదాపు 11 లక్షల మంది ఓటర్లు గల ఈ నియోజకవర్గంలో ఈ నెల 18న పోలింగ్ జరిగింది.

గత ఎన్నికల్లో…..

గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి పీఆర్ సెంథిల్ నాధన్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆయనకు 4.75 లక్షల ఓట్లు రాగా, డీఎంకేు అభ్యర్థికి కేవలం 2.46 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పట్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరం కేవలం లక్ష ఓట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి హెచ్. రాజాకు కార్తీ చిదంబరం కంటే 33 వేల ఓట్లు గత ఎన్నికల్లో రావడం విశేషం. బీజేపీ అభ్యర్థి హెచ్.రాజా మూడో స్థానంలో నిలవడం గమనార్హం. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని డీఎంకే హస్తం పార్టీకి వదిలేసిదంి. బీజేపీతో పొత్తులో భాగంగా ఈస్థానాన్ని అన్నాడీఎంకే కమలం పార్టీకి వదిలేసింది. తాజాగా కార్తీ చిదంబరం, హెచ్ రాజాల మధ్య పోటీ జరుగుతోంది. డీఎంకే మద్దతు కారణంగా తాను గెలుస్తానని కార్తీ చిదంబరం చెబుతుండగా, అన్నాడీఎంకేతో పొత్తు వల్ల తన విజయం తథ్యమని హెచ్.రాజా చెబుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో తిరుమయం, శివగంగ, కరైకుడి, అలంగుడి, తిరువత్తూరు, మనందురై అసెంబ్లీ స్థానాలున్నాయి.

ఇద్దరి పట్ల అననుకూలత….

2014 మేలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు చిదంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరం సీబీఐ, ఈడీ కేసులతో సతమతమవుతున్నారు. సీబీఐ, ఈడీ విచారణలకు హాజరుకావడం, బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగడమే సమయం సరిపోయింది. తండ్రీ కొడుకులిద్దరూ ప్రముఖ న్యాయవాదులైనప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. చిదంబరం గత ఏడాది గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వడంతో కుమారుడిని శివగంగకు పంపారు. ఎంపీగా ఎన్నికైతే కొంతవరకూ ఇబ్బందులు తగ్గుతాయన్నది ఆయన భావన. బీజేపీ అభ్యర్థి హెచ్.రాజా నోటి దురుసు కారణంగా నష్టపోతున్నారు. ఆయన అభ్యర్థిత్వంపై కార్యకర్తలు మొదట్లో విముఖత చూపారు. అయితే ఆయన గతంలో కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపింది. తమిళుల ఆరాధ్య దైవమైన పెరియార్, ఈవీ రామస్వామి నాయగర్ పై రాజా ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో మైనారిటీల పైన చేసిన విమర్శలు పెనుదుమారాన్ని రేపాయి. తాజాగా శబరిమల ఆలయ వివాదంలోనూ మహిళలను ఉద్దేశించి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి కరడు గట్టిన హిందుత్వ భావాజాలం వల్ల నష్టం వాటిల్లుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కార్తీ చిదంబరం అభ్యర్థిత్వంపై కూడా మొదట్లో వ్యతిరేకత వ్యక్తమయింది. ఎయిర్ సెల్ మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో నిందితుడైన కార్తీకి టిక్కెట్ ఎలా ఇస్తారని పార్టీకి చెందిన మాజీ ఎంపి సుదర్శన్ నాచియప్పన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే కార్తీ అభ్యర్థిత్వాన్ని పార్టీ చాలా ఆలస్యంగా ప్రకటించింది. కుమారుడి విజయం కోసం చిదంబరం నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం చేశారు. చిదంబరంపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. స్థానిక ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి చేసేందేమీ లేదన్న విమర్శలున్నాయి.

ప్రజావ్యతిరేకత తీవ్రంగా….

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వస్తుందన్న భయం కమలనాధుల్లో కనిపిస్తోంది. ఇది కాకుండా అభ్యర్థి హెచ్.రాజా వ్యవహారశైలి కూడా నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం ఉంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అక్కకుమారుడు టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షుడిగా రంగంలోకి దిగారు. హిందుత్వ ఓట్లను ఆయన చీలుస్తారన్న భయం బీజేపీలో ఉంది. అభ్యర్థులను పక్కనపెడితే నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేసేవారేలేరు. శివగంగ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల్లో ఒకటి. వరిచ, చెరకు, పత్తి, మిరప,వేరుశెనగ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు అందక, గిట్టుబాటు ధర లభించక సతమతమవుతున్నారు. చెరకు పంటకు కనీస మద్దతు ధర కొరవడింది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన పంటల భీమా పథకంరైతులకు మేలు చేయలేక పోయింది. గ్రానైట్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా రవాణా సౌకర్యం లేకపోవడంతో పరిశ్రమల స్థాపనకు దూరంగా ఉంది. శివగంగ సమీపంలో తమిళనాడు మినరల్ లిమిటెడ్ కార్యాలయం ఉంది. అయినా మైనింగ్ కార్యకలాపాలు పెరగడం లేదు. పారిశ్రామిక వెనుకబాటు వల్ల యువకులు పెద్దయెత్తున వలసపోతున్నారు. కొత్తగా వచ్చే ఎంపీ ఈ సమస్యలను పరిష్కరిస్తారన్న భరోసా ప్రజల్లో కలగడం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 18134 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*