కళైంజర్… ఇక కానరావా..!

తమిళ ప్రజల ఆరాధ్య నాయకుడు ఇక లేరు. ఆరు దశబ్దాలుగా తమిళ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం తపించి ప్రజల గుండెల్లో కొలువైన ముత్తువేల్ కరుణానిధి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న 95 ఏళ్ల కరుణ చెన్నైలోని కావేరీ ఆసుప్రతిలో కన్నుమూశారు. ఆయనకు ఆరోగ్యం క్షిణించిందని తెలియగానే లక్షలాది మంది అభిమానులు ఆయన కోలుకోవాలని, తిరిగి రావాలని కోరుకున్నారు. దేవుళ్లను ప్రార్థించారు. ఆసుపత్రి వద్దకు వేలాది సంఖ్యలో ప్రజలు ఆయన చిత్రపటం పట్టుకుని ఎదురుచూశారు. తమ నాయకుడు, తమ ఆరాధ్య నేత మళ్లీ క్షేమంగా వస్తారని ఆశించారు. కానీ, వారి ప్రార్థణలు, ఆశలు ఫలించలేదు. మంగళవారం సాయంత్రం ఆయన పరిస్థితి పూర్తిగా విషమించి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

తుదిశ్వాస వరకూ తమిళుల గొంతుకగా…

తమిళనాట కళైంజర్ గా పిలుచుకునే ముత్తువేల్ కరుణానిధి ఒక పార్టీకో, ఒక వర్గానికో నాయకుడు కాదు. ఆయన మొత్తం తమిళ ప్రజలకే నాయకుడు. ప్రపంచం నలుమూలల ఉన్న తమిళులు రాజకీయాలకు అతీతంగా కరుణను తమకు పెద్దగా భావిస్తారు. కరుణకు కూడా తమిళ ప్రజల శ్రేయస్సు తర్వాతే ఏదైనా. అందుకోసం ఆయన ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడలేదు. పోటీ చేసిన పదమూడు సార్లూ ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయన సొంతం. ద్రవిడ మున్నేత్ర కజగమ్(డీఎంకే)కు ఏకంగా పది పర్యాయాలుగా అధ్యక్ష హోదాలో కొనసాగారు. యాభై ఏళ్ల పాటు సుదీర్ఘంగా డీఎంకే అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు కరుణది.

సాధారణ కుటుంబంలో జన్మించి…

నాగపట్టినమ్ జిల్లా తిరుక్కువలైలో 1924లో కరుణ జన్మించారు. ఆయన తల్లి అంజు, తండ్రి ముత్తువేలు. సాధారణ నాయిబ్రాహ్మణ కుటుంబం. కరుణానిధికి పాఠశాల దశ నుంచే సాహిత్య, తమిళ భాష, రచనలపై విపరీతమైన మక్కువ ఏర్పడింది. జస్టీస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అళగిరిస్వామి ప్రసంగాలకు కరుణ స్ఫూర్తి పొందారు. 14 ఏటనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. అప్పుడు కొంతమంది యువతను, విద్యార్థులను పోగుచేసుకుని ఆల్ స్టూడెంట్స్ క్లబ్ పేరుతో విద్యార్థి సంఘాన్ని ప్రారంభించారు. ద్రవిడ ఉద్యమానికి మద్దతుగా ఏర్పడ్డ మొదటి విద్యార్థి సంఘమది.

సామాజిక కోణంలోనే సినిమాలు…

రచయితగా తమిళ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కరుణ అనేక చిత్రాలకు పనిచేశారు. 1947లో ఎంజీఆర్ నటించిన రాజకుమారి సినిమాకు ఆయన మొదటిసారి రచయితగా పరిచయమయ్యారు. దీంతో ఎంజీఆర్ తో కరుణకు పరిచయం ఏర్పడి స్నేహంగా, ఆ తర్వాత రాజకీయ భాగస్వాములుగా… తర్వాత ప్రత్యర్థులుగా మారారు. 1948లో వచ్చిన అభిమన్యు, 1950లో వచ్చిన మరుధన్నట్టు ఇల్లవారాసి, మంతిరి కుమారి వంటి హిట్ చిత్రాలకు పనిచేశారు. తమిళ సినీ ఇండస్ట్రీనే మలుపుతిప్పిన పరాశక్తి చిత్రానికి ఆయన రచయితగా పనిచేశారు. ఈ సినిమా ద్వారానే ప్రముఖ నటులు శివాజి గణేశన్, ఎస్.ఎస్.రాజేంద్రన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ చిత్రం ద్వారా ద్రవిడ ఉద్యమాన్ని మేలుకోల్పారు. అయితే, ఈ చిత్రంపై పలు వివాదాలు తలెత్తినా 1952లో విడుదలై భారీ విజయం సాధించింది. ఆయన చిత్రాల్లో సామాజిక దురాగతాలను రూపుమాపేలా కథలు ఉండేవి. వితంతు వివాహాలు, అంటరానితనం, జమిందారీ వ్యవస్థపై ఆయన రచయితగా పనిచేసిన తంగరత్నం సినిమా ప్రజల్లో చైతన్యం నింపింది. అయితే, సామాజిక దురాచారాలను ఎత్తిచూపే  క్రమంలో ఆయన సినిమాలు కొన్ని సెన్సార్ షిప్ కు గురై బ్యాన్ అయ్యాయి కూడా. రాజకీయాల్లోకి వచ్చాక, ముఖ్యమంత్రిగా పనిచేశాక కూడా ఆయన రచనలను వదలలేదు. చివరగా 2011లో చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన పొన్నార్ శంకర్ చిత్రానికి కథను అందించారు.

నాయకుడిని చేసిన సంఘటన

తమిళనాడులో కళ్లగుడి అనే పట్టణంలో 1953లో ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థ దాల్మియా సిమెంట్స్ పేరుతో పరిశ్రమ పెట్టింది. దీంతో పాటు ఈ పట్టనానికి దాల్మియాపురంగా పేరు మార్చారు. కరుణానిధి ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడుపైన ఉత్తర భారతదేశం పెత్తనంగా దీనిని భావించారు. తన స్నేహితులతో కలిసి రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో దాల్మియాపురం అని రాసి ఉన్న వాటిని తుడిచేశారు. రైళ్లను నిలిపేశారు. ఈ ఘటనలో పోలీస్ కాల్పులలో ఆయన సహచరులు ఇద్దరు మరణించగా, ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ద్వారా ఆయన నాయకుడిగా మారారు. ఆయన భావాలు, సిద్ధాంతాలు కూడా స్పష్టంగా తెలిశాయి.

రాజకీయ ప్రవేశం

14వ ఏట అళగిరి స్వామి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించిన కరుణానిధి హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. డీఎంకేలో చేరి ఆ పార్టీలో కీలకంగా పనిచేశారు. 1957 ఏన్నికల్లో మొదటిసారిగా కులితలై స్థానం నుంచి 33 ఏటనే ఎమ్మెల్యేగా గెలిచారు. 1961లో డీఎంకే పార్టీ కోశాధికారిగా, 1962లో తమిళనాడు అసెంబ్లీలో పార్టీ ఉప నేతగా నియమితులయ్యారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఆయన మంత్రిగా పనిచేశారు. 1969లో అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై మరణించడంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిర నిర్ణయాన్ని కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించారు. మొదట సన్నిహితుడిగా ఉన్నా ఎంజీ రామచంద్రన్ తో, జయలలితతో కరునానిధి తీవ్ర రాజకీయ వైరం ఏర్పరుచుకుని పోరాడారు.

అనేక వివాదాలు

తమిళుల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసిన కరుణానిధి చుట్టూ అనేక వివాదాలూ ఉన్నాయి. ఆయనపై పలుమార్లు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన బంధుప్రీతితో వ్యవహరిస్తారని, కుటుంబానికి మేలు చేస్తారనే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్టీటీఈతో కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉండేవి. ఆయన ఓ సందర్భంలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడని ప్రకటించారు. కానీ, రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన ఎల్టీటీఈని మాత్ర భారత్ క్షమించవద్దని అన్నారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత కేంద్ర ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించింది. ఇక రామసేతు వివాదంలో కరుణ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘రాముడు ఎవరు..? ఏ ఇంజనీరింగ్ కళాశాలలో చదివి రామసేతు నిర్మించాడు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, సేతు సముద్రం ప్రాజెక్టు పూర్తయితే తమిళులకే మేలు జరుగుతుందనేది ఆయన వాదన.

ఆయన లేని లోటు పూడ్చలేనిది..!

రాజకీయాలు, ఆరోపణలు ఎలా ఉన్నా కరుణానిధిపై తమిళులకు విశేష అభిమానం. కేవలం తమిళనాడులోనే కాదు వివిధ దేశాలకు బతుకుదెరువు కోసం వలసవెళ్లిన తమిళులు సైతం కరుణను తమ ప్రతినిధిగా భావిస్తారు. తమిళులకు ఎక్కడ అన్యాయం జరిగినా, అణిచేవేసే ప్రయత్నం జరిగినా ఆయన వారి పక్షాన పోరాడేవారు. ఆయన మరణం కేవలం తమిళులకు, తమిళనాడుకే కాకుండా దేశానికే తీరని నష్టం.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*