మళ్లీ టెన్షన్ పెడుతున్నారే…??

kchandrasekharrao-cabinet-expansion

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రివర్గ విస్తరణకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావడంతో ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణపై దృష్టి పెడతారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకే మంచి ముహూర్తాలు ఉండటం, మరో నాలుగు నెలలు శుభదినాలు లేకపోవడంతో ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు బయలుదేరాయి.

ఆరు స్థానాలు ఖాళీ…..

తెలంగాణ ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఇంకా మంత్రి వర్గంలో ఆరు ఖాళీలున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి విస్తరణ ఉంటుందని అప్పట్లోనే కేసీఆర్ చెప్పారు. తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులకు సయితం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు దక్కలేదు.

అన్ని ఎన్నికలు పూర్తయి….

ప్రస్తుతం తెలంగాణలో అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. మంత్రి వర్గ విస్తరణ పై కేసీఆర్ దృష్టిపెట్టారు. త్వరలోనే కేసీఆర్ ముహూర్తం కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ దఫా విస్తరణలో కేటీఆర్, హరీశ్ రావులకు బెర్త్ లు దాదాపు ఖాయమయినట్లేనన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఈ ఇద్దరు మహిళా మంత్రులు ఎవరన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పద్మాదేవేందర్ రెడ్డి, గొంగిడి సునీతల పేర్లు విన్పిస్తున్నప్పటికీ వారికి కొన్ని కారణాల రీత్యా ఇవ్వకపోవచ్చన్న వాదన కూడా ఉంది.

వేటు పడుతుందా….?

కానీ ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో మంత్రివర్గ విస్తరణలో కొందరు పదవులను కోల్పోయే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు నలుగురైదుగురు మంత్రుల పరిధిలో పార్లమెంటు స్థానాలు చేజారిపోయాయి. వీరిపై వేటు పడే అవకాశముందంటున్నారు. అలాగే గత విస్తరణలో ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. ఈసారి ఖమ్మం జిల్లా నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారమూ జరుగుతోంది. మొత్తం మీద ఆ ఆరుగురు ఎవరన్న దానిపై శాసనసభ్యులతో పాటు ప్రస్తుత మంత్రుల్లో కూడా టెన్షన్ ప్రారంభమయింది.

Ravi Batchali
About Ravi Batchali 18099 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*