ఎంతో దూరం లేదా…??

chandrasekharrao-in-parlament-elections

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు బరిలోకి దిగనున్నారా? ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారా? ఇదే గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. ఈలోగా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ముఖ్యమంత్రి పదవిని తన తనయుడు కేటీఆర్ కు అప్పగించి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు టీఆర్ఎస్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ తో ఒడిశా, కోల్ కత్తా, డిల్లీ పర్యటనలను ముగించుకుని వచ్చిన కేసీఆర్ తన సన్నిహితుల వద్ద పార్లమెంటు ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పోటీ విషయం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

అందుకే ఈ హడావిడి….

అందుకే కేసీఆర్ వరుసబెట్టి ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నారని, ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రాష్ట్ర రాజకీయాల నుంచి హస్తిన వైపు వెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న దానిపై చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈలోపు మంత్రి వర్గ విస్తరణ పూర్తి చేయడం, సీనియర్లను తనతో పాటు జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం వివిధ నియోజకవర్గాల పేర్లను కేసీఆర్ పరిశీలించినట్లు కూడా చెబుతున్నారు.

సన్నిహితులతో చర్చలు…..

మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాలను కైవసం చేసుకుని జాతీయ రాజకీయాల్లో ముఖ్యపాత్రను పోషించాలనుకుంటున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా? వద్దా? అన్న ఆలోచన కూడా చేశారట. అక్కడ ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మెదక్ నుంచి కేసీఆర్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సొంత నియోజకవర్గం కూడా కావడంతో కొంత సానుకూలత ఉంటుందని భావిస్తున్నా..కరీంనగర్ పై కూడా ఆయన ఆలోచన చేశారంటున్నారు. గతంలోనూ కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఎంపీగా వినోద్ కుమార్ ఉన్నారు.

వివిధ నియోజకవర్గాల పేర్లు….

ఇవి కాకుండా నల్లగొండ పార్లమెంటు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా కసరత్తులు చేశారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుపొందడమే కాకుండా, ఆ ప్రాంత నేతలు కేసీఆర్ ను ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆహ్వానిస్తుండటమూ ఒకకారణమని అంటున్నారు. ఇవేమీ కాకుండా మల్కాజిగిరి పేరును కూడా పరిశీలిస్తున్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న మల్లారెడ్డి అసెంబ్లీకి ఎన్నికవ్వడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ మదిలో ఏముందో తెలియదు కాని, పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా పోటీ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 41254 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*