ఎవరా… లక్కీ ఫెలోస్….??

kchandrasekharraomlccandidates

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రి వర్గ విస్తరణను చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. తెలంగాణలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయింది. ఈ అయిదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు స్థానాలు ఖచ్చితంగా టీఆర్ఎస్ కు వస్తాయి. దీంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది. గులాబీ బాస్ కరుణ ఎవరిపైన ఉంటుందోనన్న చర్చ మొదలయింది. అధికారంలోకి రెండోసారి రావడంతో ఆశావహులు కూడా ఎక్కువగానే కన్పిస్తున్నారు. ఐదుగురు అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది.

ఐదు స్థానాల్లో…..

ఇప్పటికే మండలిలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్లే. విపక్షం అనేది పెద్దల సభలో దాదాపుగా ఉన్నా… లేనట్లే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మందికి గులాబీ బాస్ హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా కేటీఆర్ కూడా ఎమ్మెల్సీ పదవి విషయంలో కొందరికి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బుజ్జగింపుల్లో భాగంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కొందరికి హామీ ఇవ్వడంతో ఇప్పుడు వారు కేటీఆర్ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. శాసనసభ్యుల కోటా కావడంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన నేతలు కూడా దీనిపై ఆశలు పెంచుకున్నారు.

ముగ్గురి పేర్లు ఖరారు….

ఐదు స్థానాలకు గాను కె.చంద్రశేఖర్ రావు ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హోంమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న మహమూద్ ఆలీకి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వక తప్పదు. ప్రస్తుతం పదవిలో ఉండి పదవీకాలం పూర్తయిన సలీం, సంతోష్ కుమార్ లకు మరోసారి అవకాశం కల్పిస్తారన్న టాక్ గులాబీ పార్టీలో విన్పిస్తుంది. అయితే మిగిలిన రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మహిళల కోటాలో తనకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్సీ పదవి హామీ లభించిందంటున్నారు.

ఆ ఇద్దరు ఎవరు…?

ఇక ముఖ్యమంత్రి తన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డికి ఖాయంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటున్నారు. అలాగే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు దేశపతి శ్రీనివాస్ కు కూడా కేసీఆర్ అనుకూల సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. వీరితో పాటు టీఎస్ ఐఐసీ ఛైర్మన్ గాదరి బాలమల్లు, వరంగల్ జిల్లాకు చెందిన నేతలు మాజీ మంత్రి బసవరాజు సారయ్య, డాక్టర్ సుధాకర్ రావు, రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయనను ఎమ్మెల్సీ చేయాల్సి ఉంది. మరి ఎవరికి కేసీఆర్ ఓకే చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 30968 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*