కేసీఆర్ అయోమయంలో పడ్డారా..?

గత నెల రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు, చర్యలు రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలను పెంచేశాయి. డిసెంబర్ లోనే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కూడా వేగంగా పరిణామాలు జరిగాయి. కేసీఆర్ స్పీడ్ చూసిన ప్రతిపక్షాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. అయితే, ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభను టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార శంఖారావంగా భావించింది. కనీవినీ ఎరుగని స్థాయిలో సభ నిర్వహించి తెలంగాణ మొత్తం తనతోనే ఉందని ఒకరకమైన వాతావరణం తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అయితే, సభ తర్వాత ముఖ్యమంత్రి డైలమాలో పడ్డారా అనిపిస్తోంది.

అంచనాలు పెంచడంతోనే…

25 లక్షల మందితో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సభ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు పదేపదే చెప్పడంతో సభపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. నాలుగున్నరేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు ఈ సభావేదికగా చెబుతామని చెప్పారు. సభకు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రజలంతా కేసీఆర్ ఏం మాట్లాడతారోనని ఎదురుచూశారు. అయితే, సభకు టీఆర్ఎస్ పార్టీ ఆశించినంత స్పందన మాత్రం రాలేదని విశ్లేషణలు ఉన్నాయి. సభకు ముందు 25 లక్షల మంది సభకు వస్తారని చెప్పిన టీఆర్ఎస్ నాయకులు సభ తర్వాత ఎంతమంది వచ్చారో లెక్క చెప్పడం లేదు. కేవలం సభ దిగ్విజయం అయ్యిందని మాత్రమే చెబుతున్నారు. అయితే, 25 లక్షల మంది కాకున్నా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇంత భారీ సభ నిర్వహించడం మామూలు విషయం కాదు. కానీ, విపరీతమైన అంచనాలు పెంచి అంచనాలకు తగ్గట్లుగా సభ జరగకపోవడంతో ప్రతిపక్షాలు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. జోరు పెంచి టీఆర్ఎస్ పై మాటల దాడి చేస్తున్నాయి.

ఇది కేసీఆర్ ప్రసంగమేనా..?

ఇక కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురుచూశారు. ఏయే వరాలు ప్రకటిస్తారో, ఏం మాట్లాడుతారో అని ఆసక్తి కనబర్చారు. రెండు గంటల పాటు కేసీఆర్ మాట్లాడతారని పార్టీ నేతలు భావించారు. అయితే, కేసీఆర్ ప్రసంగం మాత్రం కేవలం 48 నిమిషాలు మాత్రమే సాగింది. అది కూడా కేసీఆర్ మార్క్ ప్రసంగం కాదు. ఆయన ప్రసంగంలో ఎప్పుడూ లేని విధంగా చక్కగా సాగింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి, తెలంగాణ ఉద్యమానికి దారితీసిన పరిణామాలు చెప్పేందుకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతిపక్షాలపై కూడా ఆయన తన సహజ ధోరణిలో మాటల తూటాలు పేల్చలేదు. కేవలం నామమాత్రపు విమర్శలు చేసి ఊరుకున్నారు. ఇక ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సభావేదికగా కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన అటువంటి ప్రకటన ఏది చేయలేదు. దీంతో లక్షల మంది ప్రజలు హాజరైన సభలో వారికి కేసీఆర్ కొత్తగా చెప్పింది అంటూ ఏమీ లేదు. కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఏదో అయోమయంతో ఉన్నట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ముందస్తుపై పునరాలోచన..?

వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలతో కలిసి వచ్చే ఏడాది ఏప్రిల్ – మేలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచన చేశారు. ఇది బాగా జనాల్లో నానింది. ముందస్తుకు వెళితే కచ్చితంగా భారీ విజయం సాధిస్తామని కేసీఆర్ నమ్మినట్లు కనపడింది. అయితే, ఇప్పుడు ఆయన తన నిర్ణయం పట్ల ఆలోచనలో పడ్డట్లు కనపడుతోంది. డిసెంబర్ లో మూడు రాష్ట్రాలతో కలిసి ఎన్నికలు జరగాలంటే ఈ నెల 10వ తేదీ లోపు అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, అలా అసెంబ్లీని రద్దు చేసినా కచ్చితంగా డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయనే నమ్మకం లేదు. గవర్నర్ పరిపాలన కూడా విధించే అవకాశం ఉంది. ఇక ప్రగతి నివేదన సభ కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లాలి అని తీసుకున్న నిర్ణయంపై ఆయన డైలమాలో పడ్డట్లు కనిపిస్తోంది. కేసీఆర్ మొదటినుంచీ ముందస్తుకు వెళతామని ఎక్కడా చెప్పకున్నా ఇన్ డైరెక్ట్ గా అయితే అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మొత్తానికి ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై పునరాలోచనలో పడ్డట్లు కనపడుతోంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*