
టీడీపీ కంచుకోట అయిన నియోజకవర్గమది. పాలేగాళ్లకు పురిటిగడ్డ అది. వరుసగా గెలుస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుందా? వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన తొలి అభ్యర్థి ఈసారి ఎన్నికలలో విజయం సాధిస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం. పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకే కాకుండా కేఈ కృష్ణ మూర్తి కి వ్యక్తిగతంగా పట్టున్న నియోజకవర్గం. దానికి కారణాలు కూడా లేకపోలేదు.
పునర్విభజన జరిగిన తర్వాత…..
కేఈ కృష్ణమూర్తికి డోన్ నియోజకవర్గంలో పలుకుబడి ఉండేది. పత్తికొండలో ఎస్వీ సుబ్బారెడ్డి టీడీపీ నుంచి ఐదు సార్లు విజయం సాధించారు. 1994 నుంచి పత్తికొండ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తూనే ఉన్నారు. అయితే 2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ఎస్వీ సుబ్బారెడ్డికి ఇబ్బందులు తెచ్చిపెట్టగా కేఈ కుటుంబానికి కలసి వచ్చింది. పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కృష్ణగిరి తో పాటు డోన్ నియోజకవర్గంలో ఉన్న మూడు గ్రామాలను కలపి తుగ్గలి మండలాలనను పత్తికొండ నియోజకవర్గంలోచేరారు. పత్తికొండ, మద్దికేర మండలాలను యధాతథంగా ఉంచారు. డోన్ నియోజకవర్గంలో అప్పటి వరకూ ఉన్న కృష్ణగిరి మండలం పత్తికొండలో కలవడంతో కేఈ కుటుంబం బలం పెరిగింది.
వారసుడిని పోటీలో దింపాలని….
దీంతో 2009 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తికి పత్తికొండ టిక్కెట్ ను ఇచ్చిన అధిష్టానం ఎస్వీ సుబ్బారెడ్డిని పక్కన పెట్టింది. అప్పటి నుంచి వరుసగా రెండుసార్ల నుంచి కేఈ కృష్ణమూర్తి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఈసారి కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. ఆయన తనయుడు కేఈ శ్యాంబాబును అభ్యర్థిగా నిలబెట్టనున్నారు. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి కేఈ శ్యాంబాబును గెలిపించాలని కోరుతున్నారు. అయితే కేఈ శ్యాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
దూకుడు మీదున్న శ్రీదేవి…..
ఈ నేపథ్యంలోచెరుకుల పాడు నారాయణరెడ్డి భార్య శ్రీదేవిని జగన్ తన పాదయాత్ర సమయంలో తొలి అభ్యర్థిగా ప్రకటించారు. నారాయణరెడ్డి హత్యతో శ్రీదేవి పై సానుబూతి పెరిగింది. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను రెండు సార్లు పర్యటించి వచ్చారు. దీనికి తోడు ఇన్నాళ్లూ కేఈ కుటుంబానికి అండగాఉన్న రాష్ట్ర శాలివాహన ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత తుగ్గలి నాగేంద్ర తో విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ కారణాలన్నీ శ్రీదేవి విజయానికి కారణమవుతాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తం మీద ఈసారి పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగనుంది.
Leave a Reply