కేఈ కస్సుమంటున్నారే….?

ke krishnamurty vs kotlasuryaprakashreddy

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రత్యర్థిని తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకోవడంపై ఆయన గుస్సా అవుతున్నట్లు సమచారం. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పడు కోట్ల దానిని ఖండిస్తూ వస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కర్నూలు లో జరిగిన రాహుల్ బహిరంగ సభను కూడా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దగ్డరుండి పర్యవేక్షించారు. దీంతో కోట్ల కాంగ్రెస్ ను వీడరని నమ్మారు.

కేఈ మనస్తాపం చెందారా?

అయితే టీడీపీ, కాంగ్రెస్ తో పొత్తు వచ్చే ఎన్నికల్లో ఉండదని తేలిపోవడంతో కోట్ల మనసు మార్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కుటుంబంతో సహా వెళ్లారు. అయితే ఈ విషయంపై కేఈకి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కోట్ల చేరిక అంశంపై తనతో చంద్రబాబునాయుడు చర్చించలేదని కేఈ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన తన స్థానంలో పత్తికొండ నుంచి కుమారుడు శ్యాంబాబును పోటీ చేయించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పారు.

మూడుస్థానాలతో ముడి….

కాని కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే మూడు స్థానాలు కోరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు లోక్ సభ స్థానంతో పాటుగా డోన్, కోడుమూరు నియోజకవర్గాలను కోట్ల ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ సందర్భంగా కూడా ఈ మూడు సీట్ల అంశంపై చర్చజరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు లోక్ సభ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మ, కోడుమూరు నియోజకవర్గం నుంచి తన అనచరుడి కోసం కోట్ల చంద్రబాబును కోరినట్లు సమచారం. అయితే సీట్ల విషయంలో చంద్రబాబు ఎటువంటి హామీ ఇవ్వలేదని కూడా చెబుతున్నారు.

సీటు విషయం వచ్చాక….

తొలినుంచి కోట్ల, కేఈ కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యాలున్నాయి. కాంగ్రెస్ నేతగా కోట్ల, టీడీపీ నేత కేఈ ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అనేక ఘర్షణలు కూడా జరిగాయి. అనేకమంది జైలుపాలు కూడా అయ్యారు. కోట్లతో తాము కలిసేది లేదని కేఈ వర్గీయులు బహిరంగంగా చెబుతున్నారు. తాము కోట్లతో సర్దుకుపోయేది లేదని తెగేసి చెబుతున్నారు. కేఈ కృష్ణమూర్తి కూడా కోట్ల విషయంలో స్పందించిన తీరు అనుమానాలను బలపర్చే విధంగా ఉంది. కోట్ల చేరికపై తనకు సమాచారం లేదని, తమ సీట్లు అడిగితే అప్పుడు తన స్పందన ఉంటుందని ఆయనచెప్పడం ఆయనలోని అయిష్టతకు కారణమంటున్నారు. మొత్తం మీద కోట్ల చేరుతుండటంపై కేఈ కస్సుమంటున్నారు. మరి ఆయన అధికారికంగాచేరితే స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 35884 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*