
ఆ పార్టీలు రెండు పొత్తు పెట్టుకున్నా…. ఆ ఫ్యామిలీలో మాత్రం టగ్ ఆఫ్ వార్ తప్పేట్లు లేదు. జాతీయ స్థాయిలో బీజేపీయేతరకూటమి ఏర్పాటుకు అన్ని రాష్ట్రాలకూ కాలికి బలపం కట్టుకని తిరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన రాష్ట్రంలో భవిష్యత్తులో తమ పార్టీ నేతలను ఎలా కట్టడి చేస్తారన్న చర్చ ఆసక్తిగా సాగుతోంది. కర్నూలు జిల్లా అంటేనే కోట్ల, కేఈ కుటుంబాలు గుర్తుకొస్తాయి. దశాబ్దకాలంగా రాజీకీయంగా బద్ధ వైరం ఈకుటుంబాల మధ్య ఉందన్న సంగతి అందరికీ తెలిసింది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్, టీడీపీయే రాష్ట్రంలో అధికారంలోకి ఉండేవి. కేఈ కుటుంబం టీడీపీలోనూ, కోట్ల కుటుంబం కాంగ్రెస్ లోనూ ఆదినుంచి ఉండేవి.
ఆ రెండు కుటుంబాలే…..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కేఈ కుటుంబం జిల్లాపై పెత్తనం సాగించేది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంటే కోట్ల కుటుంబం హవాయే నడిచేది. ఈ రెండు పార్టీలూ కొన్ని దశాబ్దాల పాటు వారు నమ్మిన పార్టీలనే అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీలకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నారు. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో కోట్ల కుటుంబం నాలుగేళ్ల నుంచి కొంత తెరమరుగైందనే చెప్పాలి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కింది. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కేఈ కుటుంబానికి రాష్ట్ర కేబినెట్ లో సీటు గ్యారంటీ. ఇలా సాగుతున్న తరుణంలో ఇప్పుడు ఏపీ రాజకీయాలు మారిపోయాయి.
కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఉంటే….
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమవుతున్నారు.ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి అక్కడ పొత్తుల విషయం తేలకపోయినా రెండు పార్టీల క్యాడర్ మాత్రం పొత్తు ఉంటుదని మానసికంగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు ఉంటే కేఈ, కోట్ల కుటుంబం కలసి పోతాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కానీ అది సాధ్యం కాని విషయమన్నది ఆ జిల్లాలో రెండు పార్టీల నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్న విషయం. కేఈ, కోట్ల కుటుంబానికి మధ్య ఉన్న రాజకీయ వైరం పొత్తులు ఉన్నప్పటికీ సమసి పోదని నేతలు చెబుతుండటం విశేషం. తాజాగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇదినిజమేనని చెబుతున్నాయి.
డోన్ లో మాత్రం….
డోన్ నియోజకవర్గంలో కేఈ, కోట్ల కుటుంబాలకు పట్టుంది. పొత్తులో భాగంగా కర్నూలు ఎంపీ స్థానం ఎలాగూ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన భార్య సుజాతమ్మ వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీతో పొత్తు ఉన్నా, లేకపోయినా సుజాతమ్మ పోటీ డోన్ నుంచి ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. డోన్ నియోజకవర్గం నుంచి గతంలో కేఈ కృష్ణమూర్తి ఐదుసార్లు గెలిచారు. ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో కేఈ మరోసోదరుడు కేఈ ప్రతాప్ వైసీపీ అభ్యర్ధి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై ఓటమిపాలయ్యారు. దాదాపు ఏడుసార్లు విజయం సాధించిన డోన్ ను వదులుకునేందుకు కేఈ కుటుంబం సిద్ధంగా లేదు. అలాగే కోట్ల కుటుంబం కూడా ఇక్కడ రెండు సార్లు గెలిచింది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒకసారి, కోట్ల సుజాతమ్మ మరోసారి గెలిచారు. తాజాగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ప్రకటనతో మరోసారి ఇక్కడ త్రిముఖ పోటీ జరిగే అవకాశముందని తెలుస్తోంది. కాంగ్రెస్ , టీడీపీ పొత్తు ఉన్నా ఇక్కడ మాత్రం అది ఉండదని దాదాపుగా ముందుగానే తేలిపోయింది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply