కేఈ బెంగంతా అందుగురించేనట…!!

కాంగ్రెస్ తో పొత్తు కేఈ కుటుంబంలో చిచ్చురేపేట్లుంది. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించడం దాదాపుగా ఖాయమయిపోయంది. చంద్రబాబుతో పాటే రాజకీయాల్లోకి వచ్చిన కేఈ కృష్ణమూర్తి సొంత జిల్లా కర్నూలు. అయితే కేఈ కుటుంబం గత కొంతకాలం నుంచి పత్తికొండ, డోన్ నియోజకవర్గాలపై పట్టు సంపాదించుకుంది. పత్తికొండ నుంచి ప్రస్తుతం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తమ్ముడు కేఈ ప్రతాప్ గత ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రతాప్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేఈ కృష్ణమూర్తి మరో సోదరుడు ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

వచ్చే ఎన్నికల్లో…..

ఇక వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేఈ కృష్ణమూర్తి ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ప్రకటించేశారు. వృద్ధాప్యం, యువతకు అవకాశాలు ఇవ్వాలన్న కారణంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. తన కుమారుడు కేఈ శ్యాంబాబును పత్తికొండ నుంచి పోటీ చేయించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించడంతో వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి శ్యాంబాబును బరిలోకి దింపి, తన మరోసోదరుడు కేఈ ప్రతాప్ ను డోన్ నియోజకవర్గం నుంచిపోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్న కృష్ణమూర్తి ఆ దిశగానే రెండు నియోజకవర్గాలపైనే దృష్టి కేంద్రీకరించారు. కేఈ కుటుంబం మొత్తం ఇప్పటికీ కలసే ఉంటుంది. అన్నదమ్ములందరూ సఖ్యతగానే ఉంటారు.

కోట్ల కుటుంబం నుంచి…..

అయితే తాజా రాజకీయ పరిణామాలు కేఈ కుటుంబంలో కలతలు రేపేవిగా ఉన్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా డోన్ నియోజకవర్గమే చిచ్చురేపేలా ఉంది. ఇక్కడ పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు వదిలేయాల్సిన అనివార్య పరిస్థితి తెలుగుదేశానికి వస్తుందన్నది కాదనలేని వాస్తవం. ఎందుకంటే డోన్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని ఇప్పటికే కోట్ల సుజాతమ్మ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోడలు, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాతమ్మ 2004లో కేఈ ప్రభాకర్ పై ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అలాగే 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సుజాతమ్మ కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు.

డోన్ కష్టమేనంటున్న…..

మరోసారి డోన్ నుంచి బరిలోకి దిగుతానని సుజాతమ్మ ప్రకటించారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోట్ల కుటుంబమే పెద్దదిక్కు. ఆ జిల్లాలో వారు తప్ప పెద్దగా చెప్పుకోదగిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరు. పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కర్నూలు పార్లమెంటు స్థానం ఖచ్చితంగా కోరే అవకాశముంది. దీంతో కేఈ కుటుంబానికి కేవలం ఒక్కసీటు మాత్రమే దక్కనుంది. కాంగ్రెస్ తో సఖ్యతను కేఈ స్వాగతించినా అంతర్గతంగా డోన్ నియోజకవర్గం గురించే బెంగ పట్టుకుందంటున్నారు. మొత్తం మీద ఈ పొత్తు కేఈకుటుబంలో చిచ్చురేపేలా ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం డోన్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 32308 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*