
పున్నామనరకం నుంచి తప్పించేవాడు ఎవరు అంటే.. వెంటనే చెప్పేమాట కొడుకు!! అయితే, ఇప్పుడు ఈ కొడుకు వల్లే ఓటమి అంచుల్లోకి పోతున్నారు అంటూ.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కోడెల శివప్రసాద్ గురించి చర్చించుకుంటున్నారు. హోరా హోరీగా సాగిన గురువారం నాటి ఎన్నికల పోలింగ్‌లో ప్రజలు తమ సత్తాను, కసిని కూడా కలగలిపి చూపించారు. ముఖ్యంగా సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా స్పీకర్‌గా కోడెలపై ఎంత సానుభూతి ఉందో అంతే స్థాయిలో ఆయన పుత్ర రత్నం చేసిన రాజకీయాలు కూడా కసిగా ఆయనపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించాయి. దీంతో ఇక్కడ ఓటరు తన కసిని ఓటు రూపంలో తీర్చేసుకున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
సింపతీ కోసం చేసినా..
ఇక, ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే తన ఓటమిపై అనుమానం వచ్చిన కోడెల ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లి హల్చల్ చేసుకుని, చొక్కా చింపుకుని, కళ్లజోడు పగల గొట్టుకుని, రాళ్లదాడి చేయించుకున్నారన్న విమర్శలు వైసీపీ వర్గాల నుంచి వస్తున్నాయి. ఈ సంఘటన ఎలా జరిగిందన్నది పక్కన పెడితే ఈ గొడవ ఉదయం జరగడంతో కొంత మేరకు సింపతీ ఓట్లు తన ఖాతాలో పడతాయని ఆయన భావించారు. అయితే, అనూహ్యంగా ప్రజల్లో సింపతీకి బదులు మరింత కసి రేగిందని, కోడెల శివరామకృష్ణపై ఉన్న కసిని తమ ఓట్ల రూపంలోనే చూపించారని అంటున్నారు విశ్లేషకులు. సత్తెనపల్లిలో వ్యాపార వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో వైశ్య సామాజిక వర్గం ఓట్లు మరింతగా ఎక్కువ. అయితే, కోడెల కుమారుడు వీరిని పీడించి మరీ కేఎస్టీ(కోడెల సర్వీస్ ట్యాక్స్) వసూలు చేశారనేది బహిరంగ రహస్యం.
వారంతా అంబటికేనా…?
ఈ ప్రభావం తాజా పోలింగ్‌పై ప్రభావం చూపింది. వాస్తవానికి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై ఇక్కడ సానుకూలత లేకపోయినా.. ఆయన పెద్దగా ప్రచారం కూడా నిర్వహించకపోయినా కూడా కోడెల వ్యతిరేక వర్గం మొత్తం అంబటికి సానుకూలంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో కీలకమైన డబ్బు పంపిణీయే కాదు, పోల్ మేనేజ్మెంట్లో సైతం అంబటి చేతులు ఎత్తేశారు. అయినా కూడా ఓటర్లు మాత్రం కోడెలపై ఉన్న వ్యతిరేకతతో అంబటికే పట్టం కట్టినట్టు చర్చ నడుస్తోంది. సత్తెనపల్లి పట్టణంతో పాటు రాజుపాలెంలో మండలంలో కోడెలకు గట్టి ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తోంది.
ఇంటలిజెన్స్ వర్గాలు సయితం…..
దీంతో కోడెల విజయం దాదాపు లేనట్టేనని ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా చంద్రబాబు చెవికి చేరవేశాయి. దీనిని గ్రహించిన కోడెల వైశ్య వర్గం ముందు తన కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తన కుమారుడు కేఎస్టీ వసూలు చేస్తున్న విషయం తనకు తెలియదని ఆయన చెప్పారట. ఐదేళ్లుగా ఏం మాట్లాడని కోడెల ఇప్పుడు ఎన్నికల వేళ కుమారుడిపై నాయకుల సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేసినా వారు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయం పోలింగ్‌లో స్పష్టమైంది. అయితే, చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీకి అత్యంత పట్టున్న గ్రామాల్లోనూ అంబటికి సానుకూల ఓటు బ్యాంకు ఏర్పడడం కోడెలను ఇంటికి పరిమితం చేయనుందనే టాక్ బలంగా వచ్చేసింది.
Leave a Reply