అసలు నిజాలు ఇవేనా?

కోడెల శివప్రసాదరావు

బలవంతంగా చనిపోవడమూ నేరమే. అయితే నిందితుడు తనను తాను శిక్షించుకున్నాడు కాబట్టి, చావును మించిన శిక్ష లేదు కాబట్టి తదుపరి చర్యలుండవు. పెద్దగా చర్చ సాగదు. కానీ కొన్ని మరణాలు చావు తర్వాతనే చర్చకు తావిస్తాయి. సమాజం ఎటుపోతోందనే ప్రశ్నను లేవనెత్తుతాయి. సీనియర్ రాజకీయవేత్త, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం రాజకీయ రంగంపై అనేక ప్రశ్నలను ఎక్కుపెట్టింది. వాటన్నిటికీ జవాబులను అన్వేషించాల్సిన బాధ్యత ఇప్పుడు పౌరసమాజం, పొలిటికల్ పార్టీలపై ఉంది. పాలిటిక్స్ లో ప్రతీకార ధోరణుల ఫలితమా? బాధితుని స్వయంకృతమా? వాడుకొని వదిలేసిన రాజకీయమా? ఎవరు ఇందుకు కారణం? ఎవరిని శిక్షించాలనే ప్రశ్నలకు బహుశా నికార్సైన సమాధానం దొరకదు. ఇప్పటికే కమ్ముకుంటున్న రాజకీయ రచ్చ ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది.

అపజయం అనాథ…

మూడున్నర దశాబ్దాల పైచిలుకు రాజకీయ అనుభవం, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, సభాపతిగా సుదీర్ఘ ప్రస్థానం కోడెల శివప్రసాదరావు ప్రత్యేకతను చాటి చెబుతాయి. ఆటుపోట్లు, ఒత్తిడులు, ఉత్థానపతనాలు, ప్రత్యర్థుల దాడులు కోడెల శివప్రసాదరావుకు కొత్తేమీ కాదు. స్వయంగా వైద్యుడైన కోడెలకు రోగమేమిటో కూడా తెలుసు. కానీ చికిత్స మాత్రం తెలియలేదు. 72 ఏళ్ల జీవనం ఎగుడుదిగుళ్లకు అతీతమేమీ కాదు. అందువల్ల ఈ జీవన సారంలో ఎంతో కొంత రాటుదేలి ఉంటారు. హఠాత్తుగా మానసిక ఒత్తిడికి గురై చనిపోయేంతటి బలహీనత ఉండదు. కానీ పరిస్థితులు అందుకు దారి తీశాయి. పరిస్థితులపైన , ప్రకృతిపైన చట్టపరమైన కేసులేమీ ఉండవు కనుక ఈ కేసులో వేరేవరో నిందితులుగా ఉండే అవకాశమూ లేదు. కానీ సమాజంలో నెలకొంటున్న పెడ ధోరణులు , రాజకీయ రంగంలో దిగజారిన విలువలకు ఈ బలవన్మరణం అద్దం పట్టింది. తన మరణాన్నే క్వశ్చన్ ఆఫ్ ప్రివిలేజ్ గా మిగిల్చి వెళ్లిపోయారు కోడెల శివప్రసాదరావు. అపజయం అనాథ . అది కోడెల జీవితంలోనూ నిరూపితమైంది. కోడెల శివప్రసాదరావు పార్టీకి విధేయంగానే చివరిక్షణం వరకూ జీవించారు. శాసనసభ ఎన్నికల తర్వాత కష్టకాలంలో రాజకీయంగా ఎదురీదుతున్న పరిస్థితుల్లో పార్టీ పెద్దగా పట్టించుకోలేదనే అభియోగాలున్నాయి. ఒకింత దూరం పెట్టిందనే విమర్శలూ ఉన్నాయి.

పాత వైరం పగ బడితే…

ఒక ఉన్నతస్థానానికి చేరిన తర్వాత ఆదర్శ మార్గాన్నే ఎంచుకోవాలి. న్యాయవ్యవస్థ సైతం ప్రశ్నించలేని అధికారాలతో కూడిన సమున్నత హోదా సభాపతి స్థానం. మనసా,వాచా,కర్మణా రాజ్యాంగానికి మాత్రమే విధేయుడై పనిచేయాల్సిన హోదా అది. కానీ అధికారపార్టీకి అనుచిత ప్రయోజనం కల్పించే స్థాయికి క్రమేపీ దిగజారుతూ వస్తోంది. ఇందుకు కోడెల శివప్రసాదరావు కూడా అతీతులేమీ కాదు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లేదా ప్రభుత్వం మాజీ స్పీకర్ పై మోపుతున్న ప్రధాన అభియోగాలకు సహేతుకమైన కారణాలే ఉన్నాయి. 23 మంది సభ్యులు రాజ్యాంగాన్ని చట్టుబండలు చేసి విశ్వాసరాహిత్యానికి పాల్పడితే మౌన ప్రేక్షక పాత్ర పోషించడం కోడెల శివప్రసాదరావు రాజకీయ జీవితంలో కళంకమే. దానికోసం తన నైతిక విలువలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. అయితే అప్పటి అధికారపార్టీ ఇందుకుగాను కోడెల శివప్రసాదరావుపై మోపిన ఒత్తిడి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగ పదవులు రాజకీయాలకు అతీతంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఆశయాలు ఏనాడో మంట గలిసిపోయాయి. అయితే ఇది కోడెల శివప్రసాదరావుకు మాత్రమే పరిమితం కాదు. అందరు సభాపతులూ అదే బాటలో ఉన్నారు.

స్వయంకృతం…

ప్రభుత్వం మారిన తర్వాత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై వరసగా వివిధ రకాల కేసులు నమోదయ్యాయి. స్పీకర్ గా ఉన్న సమయంలో కోడెల తమకు అన్యాయం చేశారనే ధోరణితో వైసీపీ ప్రభుత్వం ఆయనను లక్ష్యంగా చేసుకుందనే ఆరోపణలను టీడీపీ ఎక్కుపెట్టింది. ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్న తరుణంలో లెక్క సరిచేసుకోవాలని వైసీపీ భావించి ఉంటుంది. అయితే అది చట్టబద్దంగా సాగిందా? లేదా? అన్నదే ప్రశ్న. అదుపు తప్పిన కుటుంబ అక్రమాలు సర్కారు మారిన తర్వాత వరస వేధింపులుగా మారడానికి ఊతమిచ్చాయి. తన పదవిని అడ్డుపెట్టుకుని వారసులు పక్కదారి పడుతుంటే చూసీచూడనట్లు పోతే దానికి మద్దతిచ్చినట్లే అవుతుంది. కోడెల శివప్రసాదరావు ఇక్కడ పొరపాటు చేశారనే అంగీకరించాలి. పుత్ర వాత్సల్యమా? లేక పెరిగిన రాజకీయ ఖర్చులా? ఏదేమైనప్పటికీ నియోజకవర్గంలో కుటుంబసభ్యుల ప్రవర్తన తీవ్రవిమర్శలను ఎదుర్కొంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సాధారణంగా ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. నిజానికి ఆ ప్రకటనే పరిహాసాస్పదంగా మారింది. ఒక మాజీ స్పీకరుపై స్థానిక పోలీసు యంత్రాంగం దూకుడు తనం ప్రదర్శించగలిగిందంటే అందుకు అనేక కారణాలుంటాయి. వరసపెట్టి కేసులతో వేధింపుల భావనను కల్పించగలిగారంటే రాజకీయ మద్దతు లేదని చెప్పలేం. ‘ఎస్ బాస్ ’యంత్రాంగమే సర్వత్రా రాజ్యం చేస్తున్న స్థితిలో స్వతంత్రంగా అంతటి సాహసం చేస్తారనుకోలేం. సొంతపార్టీ వినిమయ విధానాలు, ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలు, కుటుంబ చిచ్చు ముప్పేటలా చుట్టుముట్టడంతోనే పల్నాటి పులి జీవితం నుంచి బలవంతంగా నిష్క్రమించాల్సి వచ్చింది. సమాజంలో తన ప్రతిష్ట మసకబారుతోందని తట్టుకోలేకపోయిన ఒక పాతతరం రాజకీయ ప్రతినిధి ఆయన. రాజకీయాల్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాల్సిన సమయం ఆసన్నమైందని కోడెల శివప్రసాదరావు మరణం గుర్తు చేసింది. రాజ్యాంగ విలువలకు కట్టుబడాలి. పార్టీల పాలిటిక్స్ కు లొంగకుండా హోదాకు తగిన గౌరవ మర్యాదలను కాపాడుకోవాలి. నేతలు తమ కుటుంబాలను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఎదురయ్యే తీవ్ర పరిస్థితులు భయానకంగా ఉంటాయి. ఇవే ఆయన జీవితం సమాజానికిచ్చిన వాలిడిక్టరీ రిమార్క్స్.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 25443 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

1 Comment on అసలు నిజాలు ఇవేనా?

  1. Very balanced , objective article , here. It is true that ‘ K Tax ‘ in palnaDu area had become a tyranny . But then, we have NOT seen any POLITICIAN committing a suicide in so many decades, did we ? Mostly, they are shameless . They guy who goes to Nampally court every Friday , is now a CM of a state. It showed , Kodela was not as shameless as that ! Politics requires some shamelessness .

Leave a Reply

Your email address will not be published.


*