
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కేంద్రంగా గుంటూరులో అఖిల పక్షం ఉద్యమించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి కనీసం ఇద్దరు పోటీ దిగడంతోపాటు గెలిచి తీరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇప్పుడు ఇలా వ్యతిరేకత వ్యక్తం కా వడం అందరినీ నివ్వెరపాటుకు గురి చేసింది. వాస్తవానికి కోడెల దూకుడు ప్రదర్శిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్పీకర్గానే ఉన్నా.. పరోక్షంగా మంత్రిగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి ఆయన గత ఎన్నికల్లో గెలిచింది సత్తెన పల్లి నియోజకవర్గం నుంచి అయితే, ఆయన మనసంతా నరసరావు పేట నియోజకవర్గంపైనే ఉంది.
వైసీపీ ఎమ్మెల్యేకు….
వచ్చే ఎన్నికల్లో తను కానీ, తన కుమారుడు కానీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు ఎలాంటి విలువలేకుండా చేశారు. ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా.. ఆయనకు ఎలాంటి ఆహ్వ నం లేకుండానే పోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలని భావిస్తున్న కోడెల ఇక్కడి ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రమే యం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగింది. అదే విధంగా కొండ పండుగ పేరుతో నియోజకవర్గంలోని కోటప్ప కొండపై కార్యక్రమాన్ని నిర్వహించి రూ.2 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకున్నారు. దీంతో చాలా మేరకు అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
క్విట్ కోడెల అంటూ…
ఇక, సత్తెనపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల పేరిట అవినీతి పెరిగిపోయిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి. ప్రతి విషయంలోనూ కమీషన్లు తీసుకున్నారనే వ్యాఖ్యలు తోడయ్యాయి. ఇలా ప్రతి విషయంలో కోడెల కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా అఖిలపక్షం మొత్తంగా ఆయన కుటుంబంపై ధర్నా పేరుతో చేసిన హడావుడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉదయం 10 గంటల నుండి వివిధ పార్టీల నాయకులు పార్టీ శ్రేణులతో ర్యాలీగా తాలుకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.క్విట్ కోడెల..సేవ్ సత్తెనపల్లి అంటూ ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క రోజుతో ఈ పోరాటం ఆగదని, ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామం.. కోడెలకు ఇబ్బంది పెడుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Leave a Reply