
నవ్యాంధ్రలో బాగా వెనకబడిన జిల్లాలుగా ఉత్తరాంధ్రాలోని మూడు ప్రాంతాలు ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిషన్ కూడా ఇదే విషయం స్పష్టం చేసింది ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణా లాంటి అస్తిత్వ పోరాటం ఇక్కడ కూడా మొదలుకావాల్సిఉంది. కానీ ప్రజల అమాయకత్వం కారణంగా అభివృధ్ధికి నోచుకోకుండా ఈ జిల్లాలు అలాగే పడి ఉంటున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ ఉత్తరాంధ్ర అభివృధ్ధి అంటూ అనేక హామీలను గుప్పించింది. అంతే కాదు తొలి క్యాబినెట్ మీటింగు కూడా విశాఖ లో పెట్టి ఏకంగా రాష్ట్ర రాజధానిపైన ఆశలు కల్పించింది. తొలి మంత్రి వర్గ సమావేశంలో ఎన్నో వరాలు ఇచ్చిన టీడీపీ ఆచరణలో మాత్రం రిక్త హస్తం చూపించింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్న వేళ ఉత్తరాంధ్ర సమస్యలు తెరపైకి వస్తున్నాయి.
మ్యానిఫేస్టోలో పెట్టాలి…..
ఉత్తరాంధ్రకు ఏం చేయబోతున్నామన్నది రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టాలని మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ డిమాండు చేస్తున్నారు. ఈ ప్రాంతాలకు సాగు నీరు, తాగు నీరుతో పాటు పరిశ్రమలు నెలకొల్పేలా పార్టీలు హామీలు ఇవ్వాలని, వాటిని అధికారంలోకి రాగానే అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. అంతే కాదు. విశాఖ రైల్వే జోన్ కూడా సాదించి తీరాలని, ఆలంటి పార్టీలకే ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని మాజీ మంత్రి చెబుతున్నారు. బాగానే ఉంది కానీ నాలుగున్నరేళ్ళుగా టీడీపీ ఇచ్చిన హామీలను ఇంతవరకూ అమలు చేయలేదు మరి దాని మీద ఎంతవరకూ పోరాడారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంతే కాదు. టీడీపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచి మళ్ళీ అవే హామీలతో జనం ముందుకు వస్తూంటే ఎందుకు నిగ్గదీయరని కూడా మాజీ మంత్రిని అడుగుతున్నారు.
టీడీపీ పనేనా…..
నిజానికి ఈ రకమైన డిమాండ్ కొణతాల చేయడాన్ని కూడా వైసీపీ, జనసేన వంటి పార్టీలు అనుమానిస్తున్నాయి. రేపటి ఎన్నికల్లో టీడీపీకి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని మళ్ళించేందుకు, మిగిలిన పార్టీలను కూడా ముగ్గులోకి లాగి కొత్త డిమాండ్లు పెడుతున్నారని అంటున్నారు. నిజానికి రైల్వే జోన్ రాకపోవడానికి టీడీపీ, బీజేపీ కారణమన్న సంగతి మాజీ మంత్రికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే నాలుగున్నరేళ్ళు పట్టించుకోకుండా ఎన్నికల ముందు పునాది రాళ్ళు వేసినంత మాత్రాన ఉత్తరారాంధ్రకు సాగు నీటి ప్రాజెక్టులు వచ్చేసినట్లేనా అని విపక్ష నేతలు అడుగుగున్నారు.
పరిశ్రమలేవీ…?
విశాఖకు రాజధాని లేకపోతే పోయింది కనీసం పరిశ్రమలైన వచ్చాయా అని కూడా నిలదీస్తున్నారు. ఏమీ చేయకుండా మళ్ళీ జనంలోకి వస్తున్న టీడీపీని డిమాండ్ చేయాలని వారు సూచిస్తున్నారు. జనంలో వైసీపీకి, జనసేనకు ఆదరణ కనబడుతూంటే దాన్ని పక్క తోవ పట్టించేందుకే ఈ ప్రాంతీయ డిమాండ్లు తెర మీదకు తెస్తున్నారని కూడా అంటున్నారు. కొణతాల సైకిలెక్కబోతున్న నేపధ్యంలో తానున్న పార్టీకి ఓట్ల కోసం ఈ గారడీ చేస్తున్నారని అంటున్నారు. మరి దీనికి మాజీ మంత్రి ఏమంటారో.
Leave a Reply